ఆగస్టు నెల నుండి దేశ ఆర్థిక రంగంలో నాలుగు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీ రోజువారీ లావాదేవీలు, ప్రయాణాలు, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తాయి.
ఈ నెలలో అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనలలో యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త రూల్స్, ప్రైవేట్ వాహనాలకు కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్, ఇంకా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై లభించే ఉచిత బీమా కవరేజ్ రద్దు వంటివి ఉన్నాయి.
1. యూపీఐలో కొత్త రూల్స్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ లావాదేవీల క్వాలిటీని మెరుగుపరచడానికి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది. ఇప్పుడు యూపీఐతో అనుసంధానమైన బ్యాంకులు, యాప్‌లు బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి రిక్వెస్టుల సంఖ్యను పరిమితం చేయాలి. అలాగే, ఆటోపే మాండేట్, అడ్రస్ వెరిఫికేషన్ వంటి కొన్ని ఏపీఐల వాడకాన్ని కూడా నియంత్రిస్తారు. ఈ మార్పులు యూపీఐ నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా మార్చడానికి ఉద్దేశించబడ్డాయి.
2. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మార్పులు
ఆగస్టు 11, 2025 నుండి, ఎస్‌బీఐ కార్డ్ కొన్ని కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని రద్దు చేయనుంది. దీని వల్ల ELITE, PRIME వంటి ప్రీమియం కార్డులు, కొన్ని ప్లాటినం కార్డులు ఉన్న కస్టమర్లు ప్రభావితమవుతారు. గతంలో ఈ కార్డులపై అదనపు ప్రయోజనంగా లభించిన కోటి రూపాయలు లేదా 50 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదు.
3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ KYC అప్‌డేట్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను ఆగస్టు 8, 2025లోపు తమ బ్యాంక్ ఖాతాల KYC వివరాలను అప్‌డేట్ చేసుకోమని కోరింది. ఇది ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం జరుగుతోంది. జూన్ 30, 2025 వరకు తమ KYC వివరాలను అప్‌డేట్ చేసుకోని కస్టమర్లందరికీ ఇది తప్పనిసరి. గడువులోగా KYC అప్‌డేట్ చేయకపోతే, ఖాతాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
4. ఫాస్టాగ్ వార్షిక పాస్
ఆగస్టు 15, 2025 నుండి ప్రైవేట్ వాహనాల యజమానుల కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ ధర 3,000 రూపాయలు. ఇది ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ లావాదేవీల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే, ఈ వార్షిక పాస్‌ను తీసుకోవడం తప్పనిసరి కాదు. కస్టమర్లు కోరుకుంటే పాత పద్ధతిలోనే ఫాస్టాగ్‌ను వాడుకోవచ్చు.
































