Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ దిగ్భ్రాంతి

www.mannamweb.com


ఎంతో ఉత్సాహంగా జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

రాజమండ్రిలో జరిగిన ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరై ఉత్సాహంగా తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న చిత్రబృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసులు, కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో వేమగిరిలో శనివారం రాత్రి గేమ్ చేంజర్ ప్రి రిలీజ్‌ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాన్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఇతర చిత్ర నటీనటులు, సినిమా బృందం హాజరయ్యారు. ఈవెంట్‌ కోసం గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23) తన స్నేహితుడు చరణ్‌తో కలిసి బైక్‌పై వచ్చాడు.

అయితే ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. స్క్రీన్లపై తమ అభిమాన హీరోలు పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌లను చూసిన వీరిద్దరూ ఆనంద పడ్డారు. ఈవెంట్‌లో సందడి చేశారు. అనంతరం రాత్రి స్వగ్రామం గైగోలుపాడుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. రంగంపేట మండలం వడిశలేరు సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీకు చేరుకోగానే వారి బైక్‌ను వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది.

వేగంగా ఢీకొట్టడంతో మణికంఠ, చరణ్‌ బైక్‌పై నుంచి కిందపడిపోయారు. ఈ దుర్ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికులు, పోలీసులు కాకినాడలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే వారిద్దరూ మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మణికంఠకు గతంలోనే తండ్రి చనిపోగా.. తల్లి కష్టపడి చదివిస్తోంది. ఇక చరణ్ తన తండ్రితో కలిసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరూ మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం రంగంపేట పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ సంఘటన ఆలస్యంగా తెలుసుకున్న చిత్రబృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన విషయమై పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ దృష్టికి వెళ్లిందని సమాచారం. చిత్రబృందం కూడా ఈ దుర్ఘటనపై స్పందించే అవకాశం ఉంది. కాగా బాధిత కుటుంబాన్ని సినీ హీరోలను ఆదుకోవాలని వారి బంధుమిత్రులు కోరుతున్నారు. వారిద్దరూ మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానం అని.. సినిమా ఈవెంట్‌కు ఎంతో అభిమానంతో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుల స్నేహితులు చెబుతున్నారు. వారి కుటుంబాలను పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌ ఆదుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.