Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?

Gangs Of Godavari Review: రివ్యూ: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’… మాస్ గెటప్‌లో విష్వక్‌సేన్‌ మెప్పించారా…?
నటీన‌టులు: విష్వక్‌సేన్‌, అంజ‌లి, నేహాశెట్టి, నాజ‌ర్‌, పి.సాయికుమార్‌, హైప‌ర్ ఆది, ప‌మ్మిసాయి, మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, పృథ్వీరాజ్‌, మ‌యాంక్ ప‌రాఖ్‌, ఆయేషా ఖాన్ (ప్ర‌త్యేక‌ గీతం) త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం: అనిత్ మ‌దాడి, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కూర్పు: న‌వీన్ నూలి, క‌ళ‌: గాంధీ న‌డికుడిక‌ర్‌, నిర్మాణం: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ‌చైత‌న్య‌. నిర్మాణ సంస్థ‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, విడుద‌ల‌: 31 మే 2024


కొన్ని నెలలుగా మూత‌ప‌డిన థియేట‌ర్ల త‌లుపులు మ‌ళ్లీ తెర‌చుకునేలా ఈ వారం మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఒక‌టి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నుంచి రావ‌డం… విష్వక్‌సేన్‌ (Vishwak sen) క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా కావ‌డంతో విడుద‌ల‌కి ముందే సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. ర‌చ‌యిత కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు… ప్ర‌చార చిత్రాలూ ప్రేక్ష‌కుల్ని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించాయి. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం…
క‌థేంటంటే?
ఎద‌గ‌డం మ‌న హ‌క్కు అని న‌మ్మిన ఓ యువ‌కుడు లంక‌ల ర‌త్నాక‌ర్ (విష్వక్‌ సేన్‌). తండ్రి చెప్పిన ఆ మాట‌ని చిన్న‌ప్పుడే బాగా ఒంట‌బ‌ట్టించుకుంటాడు. త‌న‌లోని మ‌నిషిని ప‌క్క‌న‌పెట్టి, ఎదుటివాళ్ల‌ని వాడుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. చిన్నచిన్న దొంగ‌త‌నాలు చేసే ర‌త్నాకర్‌ … స్థానిక ఎమ్మెల్యే దొర‌సామి (గోప‌రాజు ర‌మ‌ణ‌)కి కుడిభుజంగా మార‌తాడు. దొర‌సామి, నానాజీల మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ వైరంలోకీ త‌ల‌దూర్చుతాడు (Gangs Of Godavari Review). ఆ రాజ‌కీయం అత‌న్ని ఎక్కడిదాకా తీసుకెళ్లింది? అత‌ను కోరుకున్న‌ట్టు ఎదిగాడా, లేదా? లంక‌ల్లోని ప‌గ అత‌న్ని ఎలా వెంటాడింది? బుజ్జి(నేహాశెట్టి), ర‌త్న‌మాల (అంజ‌లి)ల‌తో రత్నాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా అనగానే ప‌చ్చ‌టి ప‌ల్లెసీమ‌లు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణ‌మే గుర్తొస్తుంది. ఇప్ప‌టివరకు మ‌న సినిమాల్లో ఎక్కువ‌గా చూపించింది అదే. కృష్ణ‌చైత‌న్య మాత్రం కాస్త భిన్నంగా ఎరుపెక్కిన గోదావ‌రిని ఈ సినిమాలో చూపించారు (Telugu Movie Review). అక్క‌డి రాజ‌కీయాలు, ఆధిప‌త్య పోరు, లంక గ్రామాల్లోని ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ఓ యువ‌కుడి ప్ర‌యాణాన్ని ముడిపెడుతూ క‌థ‌ని మ‌లిచారు. అక్క‌డ‌క్క‌డా రంగ‌స్థ‌లం ఛాయ‌లు క‌నిపించే ఈ క‌థ ప‌రిధి గోదావ‌రి అంతా విస్తృతంగానే వుంటుంది. ప్ర‌తీ పాత్ర‌కీ దానిదైన ఓ ప్ర‌యాణంతో స్క్రిప్ట్‌ని రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ విష్వక్‌సేన్‌, అంజ‌లి పాత్ర‌లు మిన‌హా మిగ‌తా ఏ పాత్ర‌లూ ప్ర‌భావం చూపించ‌వు. గాఢ‌త‌, భావోద్వేగాలే ఇలాంటి క‌థ‌ల‌కు బ‌లం. కానీ ఇందులో చాలా స‌న్నివేశాలు మ‌రీ ఎక్కువ‌ నాట‌కీయత‌తో సాగడం.. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లో బ‌లం లేక‌పోవ‌డం.. క‌థానాయిక నేహాశెట్టి పాత్ర కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించేలా లేక‌పోవ‌డంతో ఆశించిన భావోద్వేగాలు పండ‌లేదు (Movie Review). మంచి విజువ‌ల్స్‌, సంగీతంతో కూడిన ఖ‌రీదైన స‌న్నివేశాలు తెర‌పైన చ‌ప్ప‌గా సాగిపోతూ ఉంటాయి. రాజ‌కీయ క్రీడ‌లో భాగంగా క‌థానాయ‌కుడు వేసే ఎత్తులు పైఎత్తులు చాలానే ఉంటాయి. వాటిని మరింత ఉత్కంఠభ‌రితంగా తెరకెక్కిస్తే బాగుండేది. ఇంత గాఢ‌మైన క‌థ‌ని, నేప‌థ్యాన్ని ఆవిష్క‌రిస్తున్న‌పుడు ప్ర‌తినాయ‌కుల్ని మ‌రీ అంత బ‌ల‌హీనంగా చూపించ‌డం క‌థ‌కు ఏమాత్రం అత‌క‌లేదు.

లంక గ్రామాల్లో క‌త్తి పట్టే సంప్ర‌దాయంతో స‌న్నివేశాల్ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు వేగంగానే క‌థా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లారు (Gangs Of Godavari Review telugu). క‌థానాయ‌కుడిని మాస్‌గా ఆవిష్క‌రించిన తీరు, పోరాటాలు, అంజ‌లి పాత్ర ప్ర‌యాణం ప్ర‌థ‌మార్థానికి ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. క‌థానాయ‌కుడి పాత్ర‌లో మాస్ కోణం, అత‌ని వ్య‌క్తిత్వం వ‌ర‌కూ స‌మ‌స్య‌లేమీ లేక‌పోయినా… ఆ పాత్ర ఎదుగుద‌ల చూపెట్టిన తీరే మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఓ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయ‌డం, మ‌రో ఎమ్మెల్యేని చంపి న‌దిలోకి విసిరేయ‌డం వంటి స‌న్నివేశాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ద్వితీయార్థం సినిమాలో న‌దిలో సాగే ఓ స‌న్నివేశం బాగుంది. చివ‌ర్లో తండ్రీ, కూతుళ్ల బంధం నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించే ప్ర‌య‌త్నం చేసినా అదేమీ ప్ర‌భావం చూపించ‌లేదు.
ఎవ‌రెలా చేశారంటే?
యువ నాయ‌కుడు లంక‌ల ర‌త్నాక‌ర్‌గా విష్వక్‌సేన్‌ (Vishwak sen) త‌న‌దైన ముద్ర వేశాడు. త‌న‌లోని మాస్ కోణానికి త‌గిన శ‌క్తివంత‌మైన పాత్ర ఇది. అందుకు త‌గ్గ‌ట్టుగానే హుషారుగా న‌టించాడు. పోరాటాలు, పాట‌ల‌పైనా ప్ర‌భావం చూపించారు. అంజ‌లి పాత్ర అర్థ‌వంతంగా ఉంటుంది. ఆ పాత్ర‌పై ఆమె అంతే ప్ర‌భావం చూపించారు. నేహాశెట్టి అందంగా క‌నిపించింది. కానీ ఆ పాత్ర ప్ర‌యాణంలోనే కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. నాజ‌ర్‌, గోప‌రాజు ర‌మ‌ణ, సాయికుమార్, ప్ర‌వీణ్‌, ప‌మ్మి సాయి, హైప‌ర్ ఆది త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. గ్యాంగ్స్‌లో క‌నిపించే పాత్ర‌లూ బ‌లంగా గుర్తుండిపోయేలా ఉంటాయి. సాంకేతిక విభాగాలే ఈ సినిమాకి ప్ర‌ధాన‌ బ‌లం. కెమెరా విభాగం అత్యుత్త‌మ ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించింది. 90వ ద‌శ‌కం నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తీ ఫ్రేమ్ విలువైన‌దిగా ఉంటుంది. యువ‌న్ శంకర్ రాజా నేప‌థ్యసంగీతం మ‌రో ఆక‌ర్ష‌ణ ఈ సినిమాకి. చాలారోజుల త‌ర్వాత తెలుగు సినిమాకు ప‌ని చేయడంతో ఈ సినిమాపై చాలా ప్ర‌భావం చూపించారు. మోత మోగిపోద్ది, సుట్టంలా సూసి పాట‌లు, చిత్రీక‌ర‌ణ బాగున్నాయి (Gangs Of Godavari Review). క‌ళ‌, కూర్పు త‌దిత‌ర విభాగాల ప‌నితీరు కూడా మెప్పిస్తుంది. ర‌చ‌యిత‌గా కృష్ణ‌చైత‌న్య ముద్ర ఈ సినిమాపై క‌నిపిస్తుంది కానీ, ఆయ‌న ర‌చ‌న ప‌రంగానే ఈ సినిమాకి చాలాచోట్ల లోటు చేశారు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆత్రుత‌, ఆస‌క్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉంటే బాగుండేది. గోదావ‌రిలో ఎరుపు, గోదావ‌రి లంక‌ల్లో ఏడుపు నాతోనే ఆగిపోవాలి… స‌హా చాలా సంభాష‌ణ‌లు గుర్తుండిపోతాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.
+ బ‌లాలు
+ విష్వ‌క్‌సేన్ న‌ట‌న
+ క‌థా నేప‌థ్యం
+ ఛాయాగ్ర‌హ‌ణం, నేప‌థ్య సంగీతం
– బ‌ల‌హీన‌త‌లు
– భావోద్వేగాలు
– నాట‌కీయ‌త‌తో కూడిన స‌న్నివేశాలు
చివ‌రిగా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి… ఎరుపెక్కిన గోదావ‌రి

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!