గోల్డ్‌ లోన్స్‌పై త్వరలో ఆర్‌బీఐ మార్గదర్శకాలు

బంగారం రుణాల విషయంలో మార్గదర్శకాలకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రుణ జారీ సంస్థలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.


బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు (Gold loans) సంబంధించి నిబంధనలు కఠినతరం కానున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకటించింది. దీంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ వంటి రుణ జారీ సంస్థల షేర్లు భారీగా క్షీణించాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు ఆర్‌బీఐ చర్యలకు సిద్ధమవుతోందని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్‌బీఐ తాజాగా స్పందించింది. వివిధ రకాల నియంత్రణ సంస్థలు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సమన్వయం చేయడంతో పాటు, సాధ్యమైనంత వరకు రిస్క్‌ తగ్గించేందుకు త్వరలో సమగ్ర నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. ఎంపీసీ సమావేశ వివరాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్‌బీఐ ప్రకటనతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర పతనం అయ్యాయి. బీఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్లు రూ.2063కు చేరాయి. ఐఐఎఫ్‌ఎల్‌ షేర్లు సైతం 8 శాతం మేర క్షీణించాయి. మణప్పురం షేర్లు 3 శాతం, చోళమండలం షేర్లు 4.7 శాతం మేర పడ్డాయి. ముత్తూట్‌ ఫైనాన్స్‌ జారీ చేసే రుణాల్లో 98 శాతం వరకు బంగారం తాకట్టుగా పెట్టుకుని ఇచ్చేవే అధికం కావడంతో ఆ కంపెనీ షేర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మణప్పురం 50 శాతం, ఐఐఎఫ్‌ఎల్‌ 21 శాతం చొప్పున మొత్తం రుణాల్లో వాటాను కలిగిఉన్నాయి. రుణాల జారీ విషయంలో ఆర్థిక సంస్థలేవీ ఒకేతరహా విధానాలు పాటించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం, వేలం వరకు ఇలా ప్రతి దానికీ విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.