ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగాల కొరత ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. దీనిని బట్టి చూస్తే త్వరలోనే కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భారీగా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేయగా గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరందరికీ అదే ఏడాది ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో అనూహ్యంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఎన్డీయే సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు గడువును ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా కాళోజీ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు ఆగస్టు 13 సాయంత్రం 6 గంటలతో గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.
నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్, అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్ధులు తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.