కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన వచ్చే అవకాశం..

కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఏదో ఒక ప్రయోజనం చేకూరుతుందన్న ఆశాభావం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు లబ్ది చేకూరుతుందని ఆశిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు. భారీగా జీతాలు పెరుగుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు అంశంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల జీతాలకు సంబంధించి 8వ పే కమిషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ అమలులో ఉంది. 8వ పే కమిషన్ ఏర్పాటైతే ప్రతిపాదనలు స్వీకరించేందుకు 12 నుంచి 18 నెలల టైం పడుతుంది. అదే జరిగితే కనుక ఉద్యోగుల జీతాలు భారీగా పెరగచ్చుననే అంచనాలు ఉన్నాయి. 8వ వేతన కమిషన్ తో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 7వ వేతన కమిషన్ కి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లతో పరిచయం చేసింది కేంద్రం. ప్రస్తుత కనీస వేతనం 18 వేలుగా ఉంది. అయితే 8వ పే కమిషన్ తీసుకొచ్చినట్లైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెరగవచ్చునని.. 3.68 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

అదే జరిగితే ప్రస్తుతం ఉన్న కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలకు చేరనుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కారణంగా ఒక్కసారిగా 8 వేల రూపాయలు పెరగనుంది. ఇక కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసిన తర్వాత డీఏ పెంపు 50 శాతం నేపథ్యంలో కనీస వేతనంలోకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని విలీనం చేస్తారని.. అప్పుడు వేతనం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. కానీ జాతీయ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తల ప్రకారం 8వ వేతన కమిషన్ వస్తే కనుక ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.