మద్యం, ఇసుక పాలసీల అమలు పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించొద్దని ఆదేశించారు సీఎం చంద్రబాబు. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ. 5 లక్షలు జరిమానా విధించాలని.. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించొద్దని అధికారులకు సూచించారు.
MRPకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం. ఇప్పటికే మద్యం పాలసీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. లిక్కర్ పాలసీలో ఎవరు వేలు పెట్టినా ఊరుకోమని హెచ్చరించారు.
ఇసుక వ్యవహారంలోనూ ఎవరూ జోక్యం చేసుకోవద్దని క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. మద్యం, ఇసుక పాలసీల అమలుపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఏపీలో ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇసుక రాష్ట్ర సరిహద్దు దాటితే వాహనం సీజ్ చేయాలంటున్న సీఎం.. సప్లైయర్ హద్దు మీరితే ప్రజలు కూడా తిరగబడవచ్చని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి.