ఉద్యోగులకు అందే పెన్షన్ కనీస పరిమితి గత 10 సంవత్సరాలుగా ఒక స్థాయిలో ఉండడంతో దాన్ని పెంచడానికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ చర్యలు చేపట్టింది.
ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్.. ప్రభుత్వానికి సూచనలు చేసింది.
దేశంలో పెన్షన్ విభాగాన్ని నిర్వహణ చూసే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ).. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ (ఈపిఎస్) కింద ఉద్యోగులకు ఇస్తున్న కనీస పెన్షన్ రూ.1000 మాత్రమే. అయితే డిసెంబర్ 16, 2024 సోమవారం పార్లమెంటు ఈపిఎఫ్ రిపోర్ట్ ని సమర్పించారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ కు సంబంధించిన ప్యానెల్ సమర్పించిన ఈ రిపోర్ట్ లో కనీస పెన్షన్ పరిమితి పెంచాలిన సూచించింది.
ఈపిఎస్ విధానం కింద ప్రభుత్వం రూ.15000 జీతంపై 1.16 శాతం ప్రభుత్వం తన వాటాగా పెన్షన్ అందిస్తోంది. కనీస పెన్షన్ రూ.1000 కన్నా తగ్గితే.. ఆక్చువల్ పెన్షన్ కు అదనంగా గ్రాన్ట్ ఇన్ ఎయిడ్ కలిపి ఇస్తోంది.
పెరిగిన జీవన ప్రమాణాలు, ఖర్చులు
గత పది సంవత్సరాలలో అంటే 2014 నుంచి 2024 మధ్య జీవన ప్రమాణాలు పెరిగాయి. దీంతో నిత్వాసరాలు ధరలు, మిగతా ఖర్చులు చాలా రెట్లు పెరిగిపోయాయి. 2023లోనే లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ అంశాలను మౌఖిక రూపంలో దృష్టికి తీసుకువచ్చింది. ఈ కారణంగానే పార్లమెంటు లేబర్ కమిటీ.. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని సీరియస్ గా పరిగణిస్తోంది.” అని పార్లమెంటు ప్యానెల్ తన రిపోర్ట్ లో పేర్కొంది.
“ధరలు పెరిగిపోవడం, జీవన ప్రమాణాలు పెరిగిపోవడంతో ఆర్థికంగా సామాన్య ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మూలంగానే ఆర్థిక మంత్రిత్వశాఖ, లేబర్ శాఖ, ఈపిఎఫ్‌ఓ.. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి ప్రభావిత పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించాలి అని పార్లెమెంటు లేబర్ కమిటీ” వ్యాఖ్యానించింది.
అయితే ఫిబ్రవరి 2024లో లేబర్ మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించినా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచేందుకు నిరాకరించింది. లేబర్ శాఖ కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.2000 చేయాలని ప్రతిపాదించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఈపిఎస్ కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదిస్తూ.. పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి ఉపసంహరించే విధంగా వెసలుబాటు ఉంటుందని తెలిపింది. జనవరి 1, 2025 నుంచి పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాన్ని ఏదైనా బ్యాంకు నుంచి లేదా సూచించిన బ్యాంక్ ఎటిఎంల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.