ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ప్రభుత్వం. బదిలీల మినహాయింపుల విషయంలో కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. బదిలీల కోసం చూస్తున్నా లేక బదిలీల్లో మినహాయింపుల కోసం చూస్తున్నవారికి కీలకమైన అప్‌డేట్ ఇది. ఉద్యోగుల బదిలీలు, మినహాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏ విధమైన ధృవపత్రాలు సమర్పించాలో వెల్లడించింది. ఉద్యోగ సంఘాలు బదిలీల్లో మినహాయింపులు కోరితే తగిన ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించినవారిపై విచారణ జరుగుతోందని తెలిపింది.
ఉద్యోగుల బదిలీలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మార్చ్ 15 నుంచి జూన్ 2 వరకు ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసినవారికి బదిలీ తప్పదని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పసరిగా బదిలీ కావల్సిందే. ఐదేళ్లు పూర్తికానివారు అభ్యర్ధనపై బదిలీ కావచ్చు. 2026 మే 31కి రిటైర్ అయ్యేవారికి ఇది వర్తించదు.
ఒకే స్టేషన్‌లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని లెక్కలో తీసుకుంటారు. ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు. దృష్టి సమస్యలున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలుంటే వైద్య సదుపాయాలున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు దాటి పనిచేసినవారికి, 40 శాతం దాటి అంగ వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కారుణ్య నియామకంలో నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు.
































