ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) మెంబర్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ సేవింగ్స్‌పై వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కీలక మార్పులు చేసింది.
దీంతో సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే కాకుండా, చివరి సెటిల్‌మెంట్ తేదీ వరకు సేకరించిన బ్యాలెన్స్‌పై వడ్డీ చెల్లిస్తారు. ఈ సర్దుబాటుతో సభ్యులు డబ్బును విత్‌డ్రా చేసుకునేటప్పుడు సేవింగ్స్‌కి పూర్తి విలువ పొందుతారు.
వడ్డీ లెక్కింపులో మార్పులు
ప్రస్తుతం, 24వ తేదీలోపు సెటిల్ అయిన క్లెయిమ్స్‌కు మునుపటి నెలాఖరు వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతో సభ్యులు కొంత వడ్డీని కోల్పోతారు. నిబంధనలు మారిన తర్వాత, విత్‌డ్రా చేసుకునేందుకు నెల మధ్యలో దరఖాస్తు చేసుకున్న సభ్యులు ఆ అదనపు రోజులకు కూడా వడ్డీని అందుకుంటారు.
ఉదాహరణకు.. ఒక నెల 20వ తేదీన రూ.కోటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి విత్‌డ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా రూ.44,355 వడ్డీని పొందుతారు (FY24కి 8.25% వడ్డీ రేటు ప్రాతిపదికన). అదేవిధంగా రూ.2 కోట్లు ఉన్న సభ్యుడు అదనంగా రూ.88,710 అందుకుంటారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
కొత్త నిబంధనల వర్తింపు
అప్‌డేట్ చేసిన వడ్డీ లెక్కింపు నిబంధనలు ఈపీఎఫ్ సేవింగ్స్ ఫుల్ విత్‌డ్రాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు, 55 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయడం, వైకల్యం కారణంగా పదవీ విరమణ, విదేశాల్లో ఉపాధి, రెండు నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అప్లై అవుతుంది. అయితే విద్య, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పార్షియల్‌గా చేసే విత్‌డ్రాలకు వర్తించవు.
వేగవంతంగా క్లెయిమ్ ప్రాసెసింగ్
ప్రస్తుతం, క్లెయిమ్‌లు 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రాసెస్ కావు, దీంతో ఆలస్యం అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం.. నెల పొడవునా క్లెయిమ్‌లు ప్రాసెస్ అవుతాయి. దీంతో వేచి ఉండే సమయం తగ్గుతుంది, సభ్యుల క్లెయిమ్స్ వేగంగా పరిష్కారం అవుతాయి.
ఇన్‌ఆపరేటివ్ అకౌంట్స్‌పై వడ్డీ
పదవీ విరమణ తర్వాత కూడా బ్యాలెన్స్ విత్‌డ్రా చేయకపోతే, EPF అకౌంట్ మూడు సంవత్సరాల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఆ సమయంలో ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత, అకౌంట్ పనిచేయకుండా పోతుంది, వడ్డీ ఆగిపోతుంది. పదవీ విరమణ తర్వాత పొందిన వడ్డీపై సభ్యుడు పన్ను చెల్లించాల్సి వస్తుంది.
పన్ను ప్రయోజనాలు
సభ్యులు ఉద్యోగంలో ఉంటూనే 58 ఏళ్ల తర్వాత కూడా వారి EPF అకౌంట్‌కి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అయితే ఈ వయస్సులో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కాంట్రిబ్యూషన్స్ ఆగిపోతాయి. బదులుగా యజమాని, ఉద్యోగి విరాళాలు EPF అకౌంట్‌కి వెళ్తాయి.
EPS కంట్రిబ్యూషన్‌లు, పెన్షన్
యజమానులు ఉద్యోగి బేసిక్ శాలరీలో 8.33% (నెలకు రూ.1,250) EPSకి జమ చేస్తారు.
EPS వడ్డీని పొందదు, కానీ సభ్యులు 10 సంవత్సరాలల పాటు కంటిన్యూగా కాంట్రిబ్యూట్ చేశాక పెన్షన్‌కు అర్హులు.
పెన్షన్ కాలిక్యులేషన్ ఫార్ములా
పెన్షన్ = (కాంట్రిబ్యూట్ చేసిన సంవత్సరాలు × గత 5 సంవత్సరాల సగటు నెలవారీ జీతం) / 70
గరిష్టంగా నెలవారీ పెన్షన్ రూ.7,500, కనిష్టంగా రూ.1,000.
EPF ట్యాక్స్ బెనిఫిట్స్
EPFకి చేసే కాంట్రిబ్యూషన్స్‌పై పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జమ్షన్ పొందవచ్చు. ఉద్యోగులు చట్టబద్ధమైన 12% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ఎంచుకోవచ్చు. ఇందులో EPF మాదిరిగానే వడ్డీ లభిస్తుంది, ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కాంట్రిబ్యూషన్స్‌పై సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని కాంట్రిబ్యూషన్ లేకపోతే, ఈ లిమిట్ రూ.5 లక్షలకు పెరుగుతుంది.