ఈపీఎఫ్‌ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు పొందవచ్చు

ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌ఓ సేవలు పొందాలనుకుంటే కొంత ఇబ్బందే. వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ సేవలు పొందాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకున్నట్టు అతి సులువుగా ఏటీఎం ద్వారా ఈపీఎఫ్‌ఓ సేవలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులకు పీఎఫ్‌ సేవలు మరింత అందుబాటులోకి తీసుకువస్తామని.. డిజిటలీకరణతో సేవలు మరింత విస్తృతం చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


హైదరాబాద్‌లోని బేగంపేటలో ఈపీఎఫ్‌ఓ నూతన జోనల్​ కార్యాలయాన్ని గురువారం కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవీయా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ‘ఈపీఎఫ్‌ఓ అంటే దేవాలయమే’ అని అభివర్ణించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. డిజిటలీకరణతో సేవలు మరింత విస్తృతం చేస్తామని.. భవిష్యత్‌ లో ఏటీఎం నుంచి కార్యకలాపాలు చేసుకోవచ్చని వివరించారు. 301 నంబర్‌ తో మరిన్ని సేవలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు.. ప్రస్తుతం అడ్డంకులను తొలగిస్తున్నట్లు చెప్పారు.

భవిష్యత్‌ లో కార్యాలయాలకే రాకుండా డిజిటల్​ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ తెలిపారు. దేశంలో అత్యధిక ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎఫ్‌ఓ అని ప్రకటించారు. ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వచ్చే కార్మికుల సమస్యలు.. క్లైయిమ్‌ లను త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్మికుల డబ్బుతో సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తుందని చెప్పారు.

‘దేశంలో ఎక్కడ పనిచేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే విత్​ డ్రా సౌకర్యాన్ని కల్పించాం. కార్మికుల సేవల కోసం 201 టోల్​ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించాం. భవిష్యత్‌లో 301 నంబర్‌తో మరిన్ని సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించి పనులు కొనసాగిస్తున్నట్లు’ కేంద్ర మంత్రి మన్సుక్‌ మాండవీయా వెల్లడించారు. యూఎఎన్​ నెంబర్​ ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించినట్లే కార్మికులు సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో ఉన్న చిన్నచిన్న ఆటంకాలు.. సమస్యలను దశల వారీగా తొలగించినట్లు తెలిపారు.
‘భవిష్యత్‌లో ఈపీఎఫ్‌ఓ లావాదేవీలు ఏటీఎం ద్వారా కూడా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని కేంద్ర మంత్రి మన్సుక్‌ మాండవీయా తెలిపారు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పని విధానంలో కూడా మార్పులను తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాల సిద్ధంగా ఉండి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.