బంగారం… కేవలం ఆభరణం కాదు, భారతీయుల పాలిట ఒక సెంటిమెంట్, అత్యవసర ఆస్తి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి వినియోగదారులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో, బంగారం కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనాన్నిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే… 9 క్యారెట్ల (9K) బంగారానికి హాల్‌మార్క్‌ను అధికారికంగా ఆమోదించడం.
సాధారణంగా 24K, 22K, 18K, 14K బంగారాల గురించి మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు 9K బంగారం కూడా మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది కేవలం ధరాభారాన్ని తగ్గించడమే కాదు, అనేక కొత్త ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
9K బంగారం అంటే ఏమిటి?
9 క్యారెట్ల బంగారం గురించి చాలా మందికి సందేహాలు ఉండవచ్చు. దాని స్వచ్ఛత గురించి తెలుసుకుందాం.9K బంగారంలో 37.5 శాతం మాత్రమే స్వచ్ఛమైన పసిడి ఉంటుంది.మిగిలిన 62.5 శాతం కాపర్ (రాగి), సిల్వర్ (వెండి), జింక్ వంటి ఇతర లోహాలు కలిపి ఉంటాయి.
ధరలో భారీ ఊరట
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, 9K బంగారం ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు, 10 గ్రాముల 9K బంగారం ధర సుమారు రూ. 48,000 . ఈ ధర అధిక క్యారెట్ల బంగారంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంటుంది.
తక్కువ స్వచ్ఛత, ఎక్కువ లాభాలు
బంగారం శాతం తక్కువగా ఉంటే నాణ్యత ఉండదా?’ అనే భయం అక్కర్లేదు. నిజానికి, ఈ ఇతర లోహాలు కలపడం వల్ల వినియోగదారులకు మూడు ప్రధాన లాభాలు ఉన్నాయి.స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. కానీ, రాగి, జింక్ వంటి లోహాలు కలపడం వల్ల 9K బంగారం చాలా గట్టిగా, దృఢంగా మారుతుంది. ఇది సులభంగా విరిగిపోవడం లేదా వంగిపోవడం జరగదు.
9K బంగారం దృఢంగా ఉండటం వలన, రోజూ ఆఫీస్‌కు లేదా ఇతర పనులకు ధరించడానికి (డైలీవేర్ యూజ్) ఇది అత్యంత అనుకూలమైనది. ఆభరణాలు త్వరగా పాడుకాకుండా, మెరుపు తగ్గకుండా ఉంటాయి.బంగారం కొనాలనే కోరిక ఉన్నా, ధర ఎక్కువగా ఉండటం వల్ల వెనకడుగు వేస్తున్న వారికి 9K బంగారం ఒక గొప్ప అవకాశం. తక్కువ బడ్జెట్‌లో, హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాన్ని సొంతం చేసుకోవచ్చు.
పెరిగిన ధరల సవాలును అధిగమించేందుకు, కేంద్ర ప్రభుత్వం 9K బంగారానికి హాల్‌మార్క్ ఇవ్వడం అనేది ఒక స్మార్ట్ నిర్ణయం. ముఖ్యంగా నిత్యం ధరించే ఆభరణాలను కొనాలనుకునే వారికి, తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో కూడిన పసిడిని కోరుకునే వారికి ఈ 9K బంగారం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది!
గమనిక: కొనుగోలుకు ముందు ఆ రోజు మార్కెట్ ధరలను, జ్యువెలరీ షాపుల్లో అందుబాటులో ఉన్న డిజైన్లను పరిశీలించడం ఉత్తమం.
































