మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. బ్రోకరేజీ ఛార్జీలను సగానికి తగ్గించింది మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ. 12 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
బుధవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ విస్తృత స్థాయి సంస్కరణలకు ఆమోదం తెలిపింది. మ్యూచువల్ ఫండ్ నియంత్రణల్లో భారీ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యయాల నిష్పత్తి విధానం, బ్రోకరేజీ ఛార్జీలపై పరిమితులు సహా ఫండ్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కీలక సంస్కరణలు చేసింది.
ఫండ్ల నియంత్రణ పరంగా మరింత స్పష్టత తెచ్చేందుకు సులభతర నియమాల అమలుకు ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సెబీ వర్గాలు తెలిపాయి. తుహిన్ కాంత పాండే సెబీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతా ఇది నాలుగో బోర్డు సమావేశం ఇది. ఆయన ఈ ఏడాది మార్చి 1వ తేదీనే సెబీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కీలక సంస్కరణలకు పూనుకున్నారు.
మ్యూచూవల్ ఫండ్లకు చెందిన టోటల్ ఎక్స్ పెన్స్ రేషియో (TER) నుంచి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ల ట్యాక్స్ (STT), స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, సీటీటీ వంటి అన్ని ఛార్జీలను విడదీస్తారు. ఇకపై టీఈఆర్ లిమిట్ లెక్కించే విధానంలో ఇవి భాగంగానే ఉండనున్నాయి. ఫండ్ పని తీరును బట్టి ఎక్స్ పెన్స్ రేషియో విధిస్తారు. స్థిరాస్తి మ్యూచువల్ ఫండ్లు, ఇన్ ఫ్రా డెట్ ఫండ్ స్కీముల్లో పలు చాప్టర్లను తొలగించింది. ఫండ్ స్పాన్సర్ల అర్హతలనూ సరళీకరించింది.
మరోవైపు స్టాక్ బ్రోకర్లకు ఇప్పటి వరకు ఉన్న 30 ఏళ్ల నాటి పాత రూల్స్ స్థానంలో సరళమైన భాషతో కొత్తవి తీసుకురావాలని నిర్ణయించింది. కాలం తీరిన రూల్స్‌కి చెల్లు చీటి ఇవ్వనుంది. నిధుల సమీకరణకు వచ్చే కంపెనీల ఆఫర్ పత్రాలను సరళీకరించనుంది. దీని ద్వారా పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు నిర్ణయాలు తీసుకోవడం ఈజీ అవుతుందని సెబీ భావిస్తోంది. కొన్ని విభాగాల్లోని ఇన్వెస్టర్లకు పబ్లిక్ ఇష్యూల్లో ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు డెట్ ఇష్యూవర్లకు అనుమతి ఇచ్చింది. హై వాల్యా డెట్ లిస్టెడ్ కంపెనీలను గుర్తించే పరిమితిని రూ.1000 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెంచారు.


































