తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన నగరమైన ఓరుగల్లు వాసులకు శుభవార్త. కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాచల కొండల్లో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామంది భక్తులు కోరుకుంటారు.
ఒక తిరుమల శ్రీవారిని మాత్రమే కాకుండా, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ నుండి భక్తులు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఓరుగల్లు వాసులకు శుభవార్త చెప్పింది.
హన్మకొండ నుండి శ్రీశైలం, తిరుపతికి రాజధాని ఏసీ బస్సులు
హన్మకొండ బస్ స్టేషన్ నుండి శ్రీశైలం, తిరుపతి మార్గాలకు నూతన రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించింది. వరంగల్ వన్ డిపోకు చెందిన ఈ బస్సులను రీజినల్ మేనేజర్ డి విజయభాను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మీదుగా ఈ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి రాజధాని బస్సు టైమింగ్స్ ఇవే
తిరుపతి మార్గంలో రాజధాని ఏసీ బస్సు ప్రతిరోజు ఉదయం 8:40 నిమిషాలకు హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి 3 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అంటే 15న్నర గంటల్లో హనుమకొండకు చేరుకుంటుంది.
శ్రీశైలం బస్సు రూట్, టైమింగ్ ఇదే
రాజధాని ఏసీ బస్సు శ్రీశైలానికి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హన్మకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. ఈ బస్సు ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్, నాగార్జున సాగర్ రింగ్ రోడ్డు మీదగా ప్రయాణం చేస్తుంది. ఇక శ్రీశైలం నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బస్సు హన్మకొండ కు చేరుకుంటుంది.
సౌకర్యంగా ఒకే బస్సులో డైరెక్ట్ గా తిరుపతి, శ్రీశైలం వెళ్ళొచ్చు
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి శ్రీశైలం, తిరుపతికి ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజు ఈ ప్రాంతాలకు రాజధాని ఏసి బస్సులను నడుపుతున్నట్టు ఆర్ ఎం విజయభాను పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ నూతన ఏసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఈ బస్సుల ఏర్పాటుతో తిరుపతికి, శ్రీశైలం కు ఓరుగల్లు వాసులు ఈజీగా ఒకే బస్సులో సౌకర్యంగా ప్రయాణం చెయ్యొచ్చు.




































