రైల్లో ప్రయాణం కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నా.. కొన్నిసార్లు అనుకోని అవాంతరాలతో షెడ్యూల్ వాయిదాపడుతుంది. దీంతో ప్రయాణికులు జేబులకు చిల్లుపడి నష్టపోవాల్సి వస్తుంది.
అయితే, ఇక నుంచి అటువంటి ఇబ్బంది ఉండదు. బుక్ చేసుకునే టిక్కెట్ల తేదీలను మార్చుకునేలా కొత్త విధానాన్ని భారతీయ రైల్వే తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ ప్రణాళికలను సులభంగా సర్దుబాటు చేసుకునే ఈ అవకాశం తొలిసారి ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కన్ఫర్మ్ రైలు టికెట్ల ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రస్తుతం ప్రయాణ తేదీని మార్చాలంటే కన్ఫర్మ్ టికెట్‌ను రద్దుచేసి, మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సిల్ చేసిన సమయాన్ని బట్టి రైల్వేలు ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో ప్రయాణికులపై అదనపు భారం, అసౌకర్యం కలుగుతుంది. ఈ విధానం రైల్వే ప్రయాణికుల ప్రయోజనాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని కేంద్ర మంత్రి అన్నారు. అందుకే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త విధానం అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, తేదీలు మార్చుకునే వెసులుబాటు కల్పించినా సీట్లు అందుబాటుపై హామీ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, కొత్త టికెట్ ధర ఎక్కువైతే, ఆ తేడాను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎటువంటి ఖర్చులు లేకుండా తమ ప్రయాణ తేదీలను సులభంగా మార్చుకోవచ్చని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుత ఉన్న నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరే 48 గంటల నుంచి 12 గంటల మధ్యలో కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే 25 శాతం వరకు, బయలుదేరడానికి 12 నుంచి 4 గంటల మధ్యలో రద్దు చేస్తే రుసుం ఇంకా పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు. ఇక, తత్కాల్ కన్ఫర్మ్ టిక్కెట్ రద్దుచేసుకున్నా.. పైసా కూడా తిరిగి ఇవ్వరు. వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీలకు మాత్రం రిఫండ్ తిరిగి వస్తుంది.
































