ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వంటనూనెలను తక్కువ ధరకే సరఫరాను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పామాయిల్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124కు అందిస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వంటనూనెల దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. వంటనూనెల సరఫరాలో ఇబ్బంది లేకుండా తగినంతగా స్టాక్ అందుబాటులో ఉంచాలని వారికి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీపై అందిస్తున్న వంట నూనెకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందన్నారు మనోహర్. దీంతో సప్లైకి దిగుమతి దారుల నుంచి ఇబ్బందులు లేకుండా సప్లై పెంచడం కోసం ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని.. అందుకే వారికి సబ్సిడీపై వంటనూనెలు అందిస్తున్నట్లు చెప్పారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని.. సరైన సమయంలో సప్లై అందించాలని మంత్రి కోరారు.
మరోవైపు మంత్రి మనోహర్ రాయితీపై అందించే కందిపప్పు సరఫరాలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణాలపై ఆరా తీసిన ఆయన.. సరఫరాదారులను ప్రశ్నించారు. నాణ్యమైన కందిపప్పు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నష్టాలను భరిస్తూ తక్కువ ధరకు కందిపప్పు అందించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఒకవేళ ఏవైనా ఇబ్బందులుంటే ముందే చెప్పాలన్నారు.
కందిపప్పు సరఫరా దారులు ప్రజలకు సహకరించాలని మంత్రి మనోహర్ కోరారు. టెండర్లో పేర్కొన్న విధంగానే.. కందిపప్పును పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయకపొతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ ధరలకు కందిపప్పు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలపై పేదప్రజలకు కందిపప్పు సరఫరా చేయాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ఈ నెలలో తక్కువ ధరకే రైతు బజార్లలో వంటనూనెలు, ఉల్లిపాయలు, టమాటాలను అందించిన సంగతి తెలిసిందే. వంట నూనెల్ని ప్రజలకు సబ్సిడీపై అందుబాటులో ఉంచుతామని చెప్పారు.