ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా, ఆ జీవో కూడా రద్దు!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్‌ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపారు.

3, 4, 5 తరగతులను గత ప్రభుత్వంలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మేజర్‌ పంచాయతీలోనూ ఒక మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాప్‌లను వీలైనంత వరకు సులభంగా ఉండేలా, ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.

నవంబరు 11న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల దినోత్సవం నిర్వహించనున్నారు. నవంబరు 14న ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మెగా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే రెండు నెలలపాటు ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కో అంశంపై చర్చించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు అధికారులు. వచ్చే వారం ప్రమోషనల్లు, బదిలీలపై చర్చించాలని నిర్ణయించారు.

అలాగే ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అంశాలను ప్రభుత్వానికి వివరించాయి. ఆరు రోజుల పాటూ ఉపాధ్యాయులకు నిర్వహించాలని నిర్ణయించిన రెసిడెన్షియల్‌ శిక్షణను మార్చాలని.. ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లకు మించి బోధన విధులు ఉండకూడదని విన్నవించారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు-29, 42, 53 అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టు టీచర్లతోనే బోధించాలని.. ఇంగ్లీష్ మీడియంతో పాటూ తెలుగు మీడియంను అమలు చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20 మించి ఉంటే ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని కోరారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఇటీవల పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి లోకేష్‌కు నిర్వహణ నిధుల సమస్య రావడంతో.. వెంటనే ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. మంత్రి లోకేష్ చొరవతో నిధుల విడుదలు కాగా.. రెండు మూడు రోజుల్లో ఈ నిధులు పాఠశాలల అకౌంట్‌లకు చేరనున్నాయి. 855 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.8.63 కోట్లు, కేజీబీవీల్లో డైట్‌ నిర్వహణకు రూ.35.61కోట్లు, మండల రిసోర్స్‌ కేంద్రాలకు రూ.8.82కోట్లు, మిగిలిన 40,728 బడులకు కాంపోజిట్‌ గ్రాంట్ల కింద రూ.51.9 కోట్లు ఇచ్చారు.