ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. విద్యా కానుకపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్యార్థులకు విద్యా కానుక కింద ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే స్కూల్, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం విద్యా కానుకలో విద్యార్థులకు అందజేసిన బ్యాగ్‌లు నాణ్యతా లోపం కారణంగా చిరిగిపోయాయని.. తమ ప్రభుత్వం బ్యాగ్‌ల నాణ్యతపై ఫోకస్ పెడుతుందన్నారు.
గత ప్రభుత్వం విద్యా కానుక కింద ఇచ్చి బ్యాగ్‌లు, బెల్టులపై పార్టీ రంగులు వేసుకుందన్నారు మంత్రి. తాము మాత్రం ఆ పని చేయబోమని.. విద్యా కానుక కిట్లపై పార్టీల రంగులు ఉండకూడదన్నారు. అలాగే విద్యార్థులకు అందించే యూనిఫాం ఏ రంగులు ఉంటే బాగుంటుంది? అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యాకానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిందన్నారు మంత్రి.
గత ప్రభుత్వం 2021-22లో విద్యా కానుక పథకాన్ని 46,22,795 మంది విద్యార్థులకు అందిస్తే.. 2023-24 నాటికి వారి సంఖ్య 38.26 లక్షలకు తగ్గిందన్నారు మంత్రి లోకేష్. ఈ లెక్కల్ని బట్టి చూస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 7.90 లక్షలు తగ్గినట్లు భావించాలన్నారు. కానీ ఈ పథకానికి చేసే ఖర్చు మాత్రం రూ.253 కోట్లకు పెరగడం విచిత్రంగా ఉందన్నారు.విద్యాకానుక కిట్‌ల కొనుగోలులో అక్రమాలు జరగడంతో ఈ ధరలు పెరిగాయన్నారు. ఈ వ్యవహారంపైనా విచారణకు ఆదేశిస్తామన్నారు. ఈ విషయంలో సంబంధం ఉన్న అధికారులపైనా కఠినచర్యలు తప్పవన్నారు.
మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యకక్రమంపైనా స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకంపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేశామని.. అయినా కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. తాము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయని.. ఈ అంశంపై ఏం చేయాలనేది చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. యువతికు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.. ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. మరోవైపు గత ప్రభుత్వం బైజుస్‌తో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపైనా పరిశీలన చేస్తున్నామన్నారు మంత్రి. ఇలా గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తామని.. ఒకవేళ వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తే యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు.