ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15వేలు, తల్లికి వందనంపై కీలక ప్రకటన

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది తల్లికి వందనం.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా.. ప్రస్తుత ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీని కోసం 2024-25 బడ్జెట్‌లో రూ. 6,487 కోట్లు కేటాయించారు.. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15 వేల చొప్పున తల్లికి వందన పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. గత‌ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు నిధుల కేటాయించింది

తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా రూ. 4,213.52 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు చేసిన ఖర్చు కంటే రూ. 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే రూ. 93 కోట్లు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక విద్యకు సంబంధించి రూ. 1,215.67 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్‌లో ఆర్జీయూకేటీకి రూ.94.73 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అన్ని వర్సిటీలు, సీపీ బ్రౌన్‌ గ్రంథాలయానికి కలిపి 2024-25కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం రూ.1,235.17 కోట్ల మేర వ్యయం చేయనుంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు చేసింది. 2024-25 ఏడాదికి రూ.4,376 కోట్లు కేటాయించగా.. మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ.173 కోట్లు ప్రతిపాదించింది. అంతేకాదు కేంద్ర పథకమైన ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమం కింద స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు నిర్మించనున్నారు. ఈ పథకం అమలుకు రూ.208 కోట్లు ప్రతిపాదించారు. ఇమామ్, మౌజమ్‌ల గౌరవ వేతనాలకు రూ.90 కోట్లు.. పాస్టర్ల గౌరవ వేతనాలకు రూ.29.49 కోట్లు.. క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు రూ.2.42 కోట్లు.. మైనారిటీ ఆర్థిక సంస్థకు రూ.173 కోట్లు.. ఉర్దూ అకాడమీకి రూ.3.66 కోట్లు కేటాయించారు.