కుప్పం ద్రవిడ వర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏడాది పెండింగ్ జీతాలు ఒకేసారి విడుదల

www.mannamweb.com


జీతాలు కోసం ఏడాది ఎదురుచూపులకు తెరపడింది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది జీతాలు పడ్డాయి. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు రూ.2.86 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
కుప్పం ద్రవిడ వర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏడాది పెండింగ్ జీతాలు ఒకేసారి విడుదల

ఏడాది కాలంగా జీతాలు రాక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాది జీతాలను ఒకేసారి విడుదల చేసింది. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి నిలిపివేశారని, ఈ విషయం తన దృష్టికి రావడంతో వారికి పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

“గత 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్య రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చాము. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది”- మంత్రి లోకేశ్
ఉద్యోగుల బదిలీ గడువు పెంపు

ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును మరోసారి పొడిగించింది.సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఇక ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అక్టోబర్ 1 తేదీన ఎక్సైజ్ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజాగా ఈ శాఖ పరిధిలోని సెబ్ ను రద్దు చేయటంతో బదిలీలకు ఎక్కువ సమయం కేటాయించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ బదిలీల గడువు ఆగస్టు 31తో ముగియాల్సి ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. అయితే పలు శాఖల్లో బదిలీలపై ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఈ గడువు 15 రోజులపాటు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని శాఖల్లో ఇంకా సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవటంతో పాటు ఎక్సైజ్ శాఖలో మార్పులు తీసుకురావటంతో మరోసారి గడువును పొడిగించారు. ఈ గడువు సెప్టెంబర్ 22వ తేదీతో పూర్తి అవుతుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(SEB)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్‌ శాఖలో రిపోర్ట్‌ చేయాలని సెబ్‌ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వంపై సెబ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.