నరసాపురం – మచిలీపట్నం సముద్ర తీరం వెంబడి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటీష్ హయాం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ రైల్వే లైన్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నరసాపురం రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారుతుంది. చివరి స్టేషన్ అన్న పేరు నుంచి తప్పుకోనుంది. ఇప్పటికీ నరసాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, గుంటూరు, విజయవాడ, నాగర్‌సోల్, బెంగళూరు, హుబ్లీ, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్‌కు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.మరోవైపు కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ పనులు పూర్తయితే నరసాపురం జంక్షన్‌గా మారుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు.
మచిలీపట్నం – నరసాపురం మార్గాన్ని రైల్వే రూట్లో కలపాలని బ్రిటీష్ హయాంలోనే ప్రతిపాదించారు. దీనిని పట్టాలెక్కించేందుకు మోదీ సర్కార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆదేశించింది. 69 కిలోమీటర్ల మేర కొత్త లైనుకు పలు చోట్ల ఉప్పుటేర్లపై వంతెనలు వేయాల్సి ఉంది. ఈ కారణంగా భారీ వ్యయమవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదనను పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం రైలులో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ వెళ్లి అక్కడి నుంచి రైలు మారాలి. అదే నరసాపురం నుంచి మచిలీపట్నం లైను పూర్తయితే మొగల్తూరు, బంటుమిల్లి మీదుగా వెళ్లొచ్చు. దీనివల్ల కోస్తా తీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో సర్వే పనులు చేపడుతున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో కోటిపల్లి రైల్వే లైనుకు రూ. 3వందల కోట్లు కేటాయించారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు. 2120 కోట్ల అంచనాతో చేపట్టిన నరసాపురం – కోటిపల్లి రైల్వే లైన్‌కు ఇప్పటి వరకు బడ్జెట్‌లో రూ. 1181.10 కోట్లు కేటాయించారని, ప్రస్తుతం 2024-25 బడ్జెట్ లో రూ. 125 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. అంతేగాకుండా 57.21 కిలోమీటర్ల మేర చేపట్టే కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ఇంకా 253.77 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని కూడా మంత్రి తెలిపారు.
ఈ కొత్త రైల్వే లైన్ వల్ల కోనసీమ జిల్లాల్లోని అమలాపురం, రాజోలుకు రైలు మార్గం ఏర్పడుతుంది. దీంతో పాటు విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్ లైన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇది ప్రత్యమ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో మూడు భారీ వంతెనల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. భూసేకరణ కూడా 75శాతం పూర్తయ్యింది. నిధులు పూర్తిస్థాయిలో ఉంటే ట్రాక్ పనులు స్పీడందుకోనున్నాయి. ఆక్వా, కొబ్బరి ఎగుమతులతో పాటు ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ కోటిపల్లి -నరసాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనులు పూర్తయితే ఎగుమతులు పెరిగి తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు కొండంత ఆశతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా రైల్వే లైన్ పనులు మొదలెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కోస్తా తీర ప్రాంత వాసుల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం వీలైనంత తర్వగా నెరవేర్చాలని కోరుకుందాం.