ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) పేదలు, మధ్యతరగతి వర్గాలకు పండగపూట శుభవార్తను అందించింది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
50 చదరపు గజాల వరకు స్థలంలో, గ్రౌండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ ప్లస్ 1 అంతస్తుల (G+1) నివాస భవనాల నిర్మాణానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంటి నిర్మాణ రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇది రూ.3,000 వరకు ఉండేది. తాజా ఉత్తర్వులతో నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.1 మాత్రమే వసూల్ చేయనున్నారు. ఈ విధానం పేద, మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.




































