నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఆ పరీక్షలు కూడా తెలుగులోనే..

www.mannamweb.com


నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనే జరగనున్నాయి.
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ పరీక్షలను తొలి సారిగా తెలుగు సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 128 నగరాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఎంహెచ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా వీటిని ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతుంటాయి. అయితే వాటిని ఇప్పటికే ఉన్న రెండు భాషలతో పాటు మరో ప్రాంతీయ 13 భాషల్లోనూ నిర్వహించాలని గత ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్నిపెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయంతో హిందీ, ఇంగ్లీష్ తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో ప్రశ్నపత్రాలను తయారు చేయనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్ టెస్ట్ ఒకటి. ఈ ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువత ప్రయత్నిస్తుంటుంది. పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు వీలుగా ఎంహెచ్ఏ, ఎస్ఎస్సీలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం పరీక్ష నిర్వహణకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువత తమ మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పరీక్షకు హాజరవుతారు. దీని వల్ల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మరింత మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజయ్యే అవకాశం ఉంటుందని, అధిక శాతం యువతకు ఉపాధి దక్కుతుందని హోం శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ మాతృభాషలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలో పాల్గొని దేశసేవలో తమ భవిష్యత్ రూపొందించుకునే సువర్ణావకాశం లభించిందని హెం శాఖ వెల్లడించింది.