ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్…త్వరలో పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల… పోస్టుల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.


డీజీపీ ఇప్పటికే ప్రభుత్వానికి ఖాళీల వివరాలను తెలియజేసినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే పోలీస్ శాఖలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్‌ను పటిష్టం చేసేందుకు ఖాళీలన్నీ భర్తీ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా లేఖ రాశారు.

పోలీస్ శాఖలో 11,639 పోస్టుల ఖాళీలు
రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి సెప్టెంబర్ 29న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పలు ఖాళీల వివరాలను సైతం లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్‌, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్‌ పోలీస్‌ విభాగంలో 315 ఎస్‌ఐలు, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్‌ఎ్‌సఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

పోలీస్ ఫోర్స్‌ను పటిష్టం చేసేందుకు ఖాళీల భర్తీ:డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోవడం, సోషల్ మీడియా ద్వారా కొందరు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తుండటం పోలీసులకు సవాలుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిపూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీజీపీ ప్రతిపాదించిన 11,639 పోస్టులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది నిరుద్యోగ యువతకు, పోలీసు శాఖ పటిష్ఠతకు ఎంతో మేలు చేస్తుంది.

నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి పెంపు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.అంటే ఈ సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. యూనిఫాం సర్వీస్‌ల్లో పోస్టులకు ఈ వయోపరిమితి పెంచడం ద్వారా వయసు కారణంగా ఉద్యోగాలకు అనర్హులైన నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రానున్నాయి.ఈ నిర్ణయం ద్వారా చాలా మంది నిరుద్యోగులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం పొందనున్నారు. ముఖ్యంగా వయోపరిమితి పెంపుతో అనర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.