తిరుపతి వందేభారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఇక నుంచి

తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్త నిర్ణయం అమలుకు సిద్దమైంది.


దీని ద్వారా ఈ రైలులో ప్రయాణం కోసం వేచి చూస్తున్న ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. ఈ రైలుకు సంబంధించి తాజా నిర్ణయం రేపు (బుధవారం) నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది.

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16బోగీలతో నడుస్తున్న వందే భారత్‌కు అదనంగా మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జత చేయాలని దక్షిణ మధ్య రైల్వేనిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయా ణికులకు అందుబాట్లోకి రానున్నాయి. కాగా, ఈ మార్గంలో వందేభారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు లో వెయింటింగ్ లిస్టు నిత్యం పెరుగుతున్న కారణంగా ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ద్వారా మొత్తం 660కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉండనున్నాయి. వారంలో మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది. కాగా.. ఈ రైలు ప్రారంభం నుంచి ప్రయాణీకుల నుంచి ఆదరణ కొనసాగుతోంది.

దీంతో.. ఇప్పుడు ఈ కోచ్ ల సంఖ్య పెంపు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి మధ్య మరో వందేభారత్ వచ్చే నెల నుంచి పట్టాలెక్కనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి తిరుపతికి నాలుగున్నార గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ ఏర్పాటు కోసం డిమాండ్ ఉన్నా.. దూరం కారణంగా వందేభారత్ స్లీపర్ ఈ మార్గంలో ఖరారు చేస్తామని.. ఇందుకు మరింత సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.