గత మూడేళ్లలో ఈ సారి ఉపాధి హామీ పని దినాలు పెరగడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ప్రభావం చూపింది. రూ. 12 వేల ఆర్థిక సాయానికి అర్హత సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల పని దినాల నిబంధన పెట్టింది. దీంతో చాలా మంది ఉపాధి పనులకు పరుగులు పెట్టారు. ఈ మేరకు రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీలో 12.21 కోట్ల పని దినాలు నమోదయ్యాయి. ఇరవై రోజులు పని దినాలు లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది ఆత్మీయ భరోసాకు అర్హత సాధించలేకపోయారు. అయితే వీరంతా ఇప్పుడు ఉపాధి పనులకు హాజరు కావడంతో ఈ ఏడాది ఆత్మీయ భరోసా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశముంది.
కూలీతోపాటు ఆర్థిక సాయం
ఒక కూలి కనీసం 20 రోజులు పని చేస్తే సగటున రూ.4,400 వస్తాయి. 30 రోజులు పనిచేస్తే సగటున రూ.6,600 వస్తాయి. కానీ వీటికి అదనంగా ప్రభుత్వం రెండు విడతల్లో ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. ఇలా పనిచేసిన వాటి కంటే అధికంగా ప్రభుత్వం ఇస్తుండటంతో కూలీలు ఉత్సాహంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. రాష్ట్రంలో 53.08 లక్షల జాబ్ కార్డులు ఉండగా, ఇందులో 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఇందులో యాక్టివ్ ఉన్న కార్డులు 32.53 లక్షలుగా ఉండగా, వీటిలో 54.74 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. యాక్టివ్ ఉన్న సభ్యుల్లో ఎస్టీలు 20.04 లక్షలు, ఎస్సీలు 21.04 లక్షలు ఉన్నారు. మిగిలిన 13.66లక్షల సభ్యుల్లో బీసీ, ఓసీలు ఉన్నారు.
గత మూడేళ్లుగా ఉపాధి హామీ పని దినాల వివరాలు
ఆర్థిక సంవత్సరం పనిదినాలు
2024–25 12.21 కోట్లు
2023–24 12.08 కోట్లు
2022–23 12.18 కోట్లు
పెరిగిన సగటు కూలీ
కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు కూలీ రూ. 32 వరకు పెరిగినట్లు చర్చ జరుగుతున్నది. కూలీలు ఉదయం పని ప్రారంభించిన తరువాత మధ్యాహ్నం మరో సారి వారు పనిచేసే ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధన తీసుకువచ్చారు. దీంతో సాయంత్రం వరకు పని చేస్తుండడంతో సగటు కూలీ సైతం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని కూలీలకు రూ.2,614 కోట్లు కూలీ రూపంలో వారి అకౌంట్లలో జమ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు రూ.2,176 కోట్లు జమ చేశారు. అదే సమయంలో ఉపాధి హామీ పనులకు వచ్చే వారిలో ప్రతి యేడు మహిళల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2020–21లో 58.06 శాతం మహిళలు హాజరైతే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి 62.51 శాతానికి చేరారు. మొత్తం గా 4.45 శాతం మహిళలు పెరిగారు.
ఉపాధి హామీ సగటు కూలీ, మహిళల శాతం
ఆర్థిక సంవత్సరం మహిళల శాతం సగటు కూలీ (రూపాయల్లో)
2024–25 62.51 169.51
2023–24 62.84 172.18
2022–23 61.56 164.33
2021–22 59.18 181.03
2020–21 58.06 213.34