ఏపీలో మహిళలకు మరో శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్, కీలక ప్రకటన

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి శ్రీకారం చుట్టగా.. మిగిలిన పథకాలపైనా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని ఆగస్టు 15కి ప్రారంభిస్తారని భావించారు.. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు మంత్రి. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో మహిళలు ఆనందంలో ఉన్నారన్నారు.

తల్లికి చెల్లికి న్యాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు బీసీ జనార్థన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై హామీ ఇచ్చింది. ఈ పథకం అమలుపై ఫోకస్ పెట్టి.. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి క్లారిటీ లేదు.. దసరా, దీపావళి అని చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు సంక్రాంతికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో ఆర్టీసీ అధికారులు పర్యటించారు.. అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ మేరకు నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అయితే ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తోంది.. అన్ని డిపోల్లో అవసరం మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట.