స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి మరోసారి అదిరే శుభవార్త అందింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు మోర తగ్గించిన క్రమంలో ఎస్‌బీఐ సైతం అదే దారిలో నడుస్తూ ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తోంది.
రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను మరో 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే లోన్ తీసుకున్న వారితో పాటు కొత్తగా లోన్ తీసుకునే వారికి తీపి కబురు అందించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను జూలై 15, 2025 నుంచే అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఇప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతం నుంచి 8.90 శాతం మధ్య ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును అన్ని టెన్యూర్ రుణాలపై మార్చినట్లు తెలిపింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు 8.20 శాతం నుంచి 7.95 శాతానికి దిగివచ్చింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు సైతం 7.95 శాతంగా ఉంది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.55 శాతం నుంచి 8.35 శాతానికి దిగివచ్చింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటును సైతం 20 బేసిస్ పాయిట్లు కోత పెట్టింది. దీంతో 8.70 శాతానికి దిగివచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 9 శాతం నుంచి 8.80 శాతానికి తీసుకొచ్చింది. ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 20 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో 9.05 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గింది. అలాగే మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.90 శాతానికి పడిపోయింది.
మరోవైపు.. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రేట్లను సైతం సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ రేట్లు సైతం జూలై 15 నుంచే అమలులోకి తెస్తోంది. ప్రస్తుతం ఎక్స్‌టెర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (EBLR) అనేది 8.15 శాతం + క్రెడిట్ రిస్క్ ప్రీమియం + బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం కలిపి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. దీని మాదిరిగానే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) అనేది 7.75 శాతం + సీఆర్‌పీ కలిసి ఉంటాయి. వడ్డీ రేట్లను తగ్గించడంతో ఆయా బెంచ్‌మార్క్ రేట్లకు లింక్ అయి ఉండే హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్స్ ఈఎంఐల భారం తగ్గనుంది.
ఎస్‌బీఐ హోమ్ లోన్ రేట్లు..
ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్లోని వివరాల ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉన్నాయి. అయితే, అది సిబిల్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే హోమ్ లోన్ టాపప్ రుణ వడ్డీ రేట్లు 8 శాతం నుంచి 10.50 శాతంగా ఉన్నాయి. ప్రాపర్టీ లోన్ వడ్డీ రేట్లు 9.20 శాతం నుంచి 10.50 శాతంగా ఉన్నాయి.
































