ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల

ఏపీ పర్యాటక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి సూర్యలంక బీచ్‌కు నిధులు ఇవ్వమని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.

ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి మంత్రి కందుల దుర్గేష్ పంపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని తెలిపారు. సూర్యలంక బీచ్‌లో మౌలిక వసతులు కల్పించి పరిశుభ్ర బీచ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పర్యాటక ప్రగతికి కృషి చేస్తున్న టూరిజం సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, పర్యాటకశాఖ అధికారులను మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.