రీఛార్జ్ ప్లాన్స్పై గుడ్ న్యూస్.. మళ్లీ పాత రోజులొస్తున్నాయ్..!

www.mannamweb.com


రీఛార్జ్ ప్లాన్స్పై గుడ్ న్యూస్.. మళ్లీ పాత రోజులొస్తున్నాయ్..!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ యూజర్లకు భారీ ఊరట కలిగించే దిశగా అడుగులేస్తోంది. గతంలో మాదిరిగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్యాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనకు ట్రాయ్ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

‘టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (TCPR) 2012’ కన్సల్టేషన్ పేపర్ను ట్రాయ్ విడుదల చేసింది. 2016లో రిలయన్స్ జియో ఎంట్రీతో భారత్ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అప్పటివరకూ డేటాకు, ఎస్ఎంఎస్లకు, వాయిస్ కాల్స్కు రీఛార్జ్ ప్లాన్స్ విడివిడిగా ఉండేవి. జియో వచ్చాక డేటా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కలిపి ఒకే రీఛార్జ్ ప్లాన్తో వస్తున్నాయి. మొబైల్ యూజర్లకు ఇన్నాళ్లూ ఈ కాంబో బెన్ఫిట్స్ బాగానే అనిపించినప్పటికీ ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఏకంగా 15 శాతం పెరిగాయి.

రీఛార్జ్ ప్లాన్ల ధరలు చూసి యూజర్లు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో డేటా అవసరం లేని మొబైల్ యూజర్లకు సపరేట్ వాయిస్ కాల్స్ ప్లాన్స్ అందుబాటులోకి వస్తే బెటరే అని చెప్పాలి. కీ ప్యాడ్ ఫోన్స్ వాడే మొబైల్ యూజర్లు ఇప్పటికీ మన దేశంలో కోట్లలో ఉన్నారు. అలాంటి వారికి వాస్తవానికి డేటా అక్కర్లేదు. ఇంటర్నెట్ సౌకర్యం లేని మొబైల్స్ వాడుతుంటారు. అయినా సరే.. వాయిస్ కాల్స్ మాత్రమే పొందేలా విడిగా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక డేటాతో కూడిన ప్యాక్స్తోనే రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టెలికాం కంపెనీలు స్వలాభం కోసం డేటా అక్కర్లేని మొబైల్ యూజర్లకు కూడా బలవంతంగా ఈ ప్లాన్స్ను అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో కొందరు మొబైల్ యూజర్లు ట్రాయ్కు తెలియజేశారు. గతంలో మాదిరిగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా కోసం విడివిడి రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ను కోరారు. మొబైల్ యూజర్ల గోడు విన్న ట్రాయ్ ఈ ఫీడ్బ్యాక్ను సీరియస్గా తీసుకుంది. అవసరం లేకపోయినా మొబైల్ యూజర్లు రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ మొత్తాన్ని చెల్లించే పరిస్థితికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. అందుకే.. అప్పట్లోలా ”కలర్ కోడింగ్ ఆఫ్ ఓచర్స్”, ”డినామినేషన్ ఓచర్స్” అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను చేస్తోంది.

టాప్- అప్ ప్లాన్స్ పేరుతో రీఛార్జ్ స్క్రాచ్ కార్డ్స్ కొన్నేళ్ల పాటు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 90కిడ్స్కు ఈ రీఛార్జ్ స్క్రాచ్ కార్డ్స్ మధుర జ్ఞాపకాల లాంటివని చెప్పాల్సిందే. ట్రాయ్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రీఛార్జ్ స్క్రాచ్ కార్డ్స్ రంగులద్దుకుని సరికొత్తగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరికి వాళ్లు మొబైల్లో ఆన్లైన్ రీఛార్జ్ చేసుకుంటున్న ఈరోజుల్లో ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ ఎంతవరకూ వాడతారో చూడాలి. వాయిస్ ఓన్లీ, ఎస్ఎంఎస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్స్ మళ్లీ తీసుకురావాలనే ఈ ప్రతిపాదనపై స్టేక్ హోల్డర్స్ నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలను ట్రాయ్ కోరింది. ఆగస్ట్ 16, 2024 లోపు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను పంపాలని కోరింది. కౌంటర్ కామెంట్స్ పంపాలనుకునే వారు ఆగస్ట్ 23 లోపు తెలియజేయాలని స్పష్టం చేసింది.