ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ విషయంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శుభవార్త చెప్పారు. వందే భారత్ రైలు గురించే కాదు నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ గురించి కూడా శుభవార్త చెప్పారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్ ను లూప్ లైన్లో నడపడానికి తొలిసారి అనుమతి లభించిందని ఆయన శుభవార్త చెప్పారు.
జనవరి 12 నుండి వందే భారత్ ఆ స్టేషన్ లో ఆగుతుంది
జనవరి 12వ తేదీ నుంచి విజయవాడ చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు సేవలు నరసాపురం వరకు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఇప్పటికే నరసాపురం వరకు రైలు పొడిగింపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేసిన ఆయన ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్లు అధికంగా ఉండడంతో జనవరి నుండి ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
అరుణాచలం వెళ్ళే రైలుకు రైల్వే అనుమతి
ఇదే సమయంలో నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కోసం రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారని, త్వరలోనే ఇది ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్ విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నెంబరు 20677/20678 రైలును నరసాపురం వరకు పొడిగించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 2026 జనవరి 12వ తేదీ నుండి ఈ రైలు నరసాపురం వరకు నడుస్తుంది.
వందే భారత్ రైలు షెడ్యూల్ లో స్వల్ప మార్పులు
ప్రస్తుతం రైల్వే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇది చెన్నై సెంట్రల్ లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్ – విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నరసాపురం వరకు పొడిగించడంతో రైలు షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
గుడివాడ, భీమవరంలోనూ ఆగనున్న వందే భారత్
జనవరి 12వ తేదీ నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నరసాపురం తో పాటు గుడివాడ, భీమవరం స్టేషన్లలో కూడా ఆగుతుంది. విజయవాడ నుండి ఉదయం 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు గుడివాడకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఒంటిగంట 14 నిమిషాలకు భీమవరం ఆపై 2 .10 నిమిషాలకు నరసాపురం చేరుకుంటుంది.
నరసాపురం నుండి చెన్నై కి, హాల్టింగ్ పాయింట్స్, టైమింగ్స్ ఇలా
తిరుగు ప్రయాణంలో నరసాపురం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 3:19 నిమిషాలకు భీమవరం, నాలుగు గంటల నాలుగు నిమిషాలకు గుడివాడ, నాలుగు గంటల యాభై నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి సాయంత్రం నాలుగు గంటల 55 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తిరిగి చెన్నై చేరుకుంటుంది.



































