గూగుల్ పే, ఫోన్‌పేలు ఔట్.. త్వరలో కరెంటు, గ్యాస్ వంటి బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించొచ్చు .

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇండియాలో నిత్యం అదిరిపోయే ఫీచర్లు పరిచయం చేస్తోంది. మెసేజ్‌లు పంపుకోవడానికే కాదు, చాలా పనులకి వాట్సాప్ మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. అదేంటంటే, బిల్ పేమెంట్ ఫీచర్. ఇది అందుబాటులోకి వస్తే మీరు మీ బిల్లులన్నీ వాట్సాప్ నుంచే కట్టేయొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్‌ కూడా అవసరం ఉండవు.


వాట్సాప్ పేమెంట్స్ 2020 నవంబర్‌లో వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ ని ఇండియాలో స్టార్ట్ చేసింది. కానీ అప్పుడు కొంతమందికి మాత్రమే ఈ ఫీచర్ ఉండేది. కానీ ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాట్సాప్ పే యూపీఐ లిమిట్‌ని తీసేసింది. అంటే ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ వాడుతున్న ఎవరైనా సరే వాట్సాప్ పేమెంట్స్ వాడొచ్చు.

దీంతో వాట్సాప్ ప్రస్తుతం పేమెంట్ యాప్స్‌కి పోటీ ఇస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా, వాట్సాప్ బిల్ పేమెంట్స్ ఫీచర్‌ని కూడా తీసుకొస్తోంది. అంటే ఇకపై మెసేజ్‌లు పంపుకోవడానికే కాదు, డబ్బులు పంపించుకోవడానికి, బిల్లులు కట్టుకోవడానికి కూడా వాట్సాప్ ఒకటే యాప్ సరిపోతుంది. * బిల్ పేమెంట్స్ ఫీచర్ రెడీ అవుతోంది..

ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా (APK teardown) వెర్షన్ (2.25.3.15)లో కొత్త బిల్ పేమెంట్ ఫీచర్ కనిపించింది. ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది కానీ, దీనికి సంబంధించిన బేసిక్ పనులు మాత్రం యాప్‌లో జరిగిపోయాయి. టెస్టింగ్‌లో ఈ ఫీచర్ మంచి ఫలితాలను అందిస్తే దీన్ని అందరికీ తీసుకురావచ్చు.

ఈ ఫీచర్ వస్తే మీరు కరెంట్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ లు, గ్యాస్ బిల్లులు, నీళ్ల బిల్లులు, ల్యాండ్ లైన్ బిల్లులు, ఇంకా ఇంటి అద్దె కూడా వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ, త్వరలోనే బీటా యూజర్లకు ఈ ఫీచర్ వస్తుంది. ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్ బీటా యాప్‌లో కొత్తగా ‘బిల్ పేమెంట్’ విభాగాన్ని చేర్చగా దాని స్క్రీన్ షాట్ కూడా బయటికి వచ్చింది. అది ప్రస్తుతం ఖాళీగా ఉంది. త్వరలో అక్కడ మొబైల్ రీఛార్జ్‌లు, గ్యాస్ బిల్లులు, డిష్ టీవీ వంటి చెల్లింపులన్నీ అందుబాటులోకి రావచ్చు. వాటిపై క్లిక్ చేసి వెంటనే పేమెంట్ చేసుకోవచ్చు. వేరే యాప్స్ అవసరం ఉండదు.

* చిక్కులు లేవా మరి.. వాట్సాప్ పేమెంట్స్‌లో దూసుకుపోతున్నా, బిల్ పేమెంట్స్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. గవర్నమెంట్ పర్మిషన్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండొచ్చు. కానీ NPCI లిమిట్ తీసేయడంతో ఒక పెద్ద అడ్డంకి అయితే దాటిపోయింది. ఒకవేళ వాట్సాప్ బిల్ పేమెంట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకొస్తే, మిగతా యూపీఐ యాప్స్‌కి ఇది పెద్ద పోటీనే అవుతుంది. ఎందుకంటే కోట్లాది మంది భారతీయులు రోజూ వాట్సాప్ వాడుతున్నారు.

బిల్ పేమెంట్స్ కూడా వాట్సాప్‌లోనే వస్తే, డిజిటల్ పేమెంట్స్ ఇంకా ఈజీ అయిపోతాయి. ప్రస్తుతానికి వాట్సాప్ యూజర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపుకోవడం, తీసుకోవడం చేస్తున్నారు. త్వరలోనే బిల్లులు కూడా కట్టేస్తారు. అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉంటే సమయం, శ్రమ ఆదా అవుతాయి.