సుప్రీం ఎఫెక్ట్..! ఏపీలో వీధి కుక్కలపై సర్కార్ కీలక ఆదేశాలు.

దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఈ మధ్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు పిల్లల్ని కరుస్తున్న ఘటనలపై దేశం విదేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని ఆక్షేపించింది.


వీటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలు కోరింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖ జంతు జనన నియంత్రణ , యాంటీ-రేబిస్ వ్యాక్సినేషన్ పై దృష్టి సారించినట్లు తెలిపింది. ఈ నెల 7 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా పాటించవలసిన మార్గదర్శకాలను అన్ని మున్సిపల్ కమిషనర్లకు జారీ చేసింది. వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి, కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి, ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాస్తవానికి 2024 జూన్ నుండి తాముఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్ధానిక సంస్ధళ పరిధిలో వీధి కుక్కల జనాభా సుమారు 5.15 లక్షలుగా అంచనా వేశారు. వీటిలో 2024 జూన్ 1 నాటికి 2,24,732 వీధి కుక్కలకు శస్త్రచికిత్స ద్వారా సంతాన నిరోధకత చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత మరో 1,36,656 కుక్కలకు సంతాన నిరోధకత చేసినట్లు వెల్లడించారు. ఇందులో 45 పట్టణ స్థానిక సంస్థల్లో వీటికి ఆపరేషన్ థియేటర్లు, కెన్నెల్స్ వంటి మౌలిక సదుపాయాలతో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 197 మంది శిక్షణ పొందిన హ్యాండ్లర్లు, డాగ్ క్యాచర్లను నియమించినట్లు తెలిపారు.

ఇప్పుడు అన్ని పట్టణ స్ధానిక సంస్ధళ కమిషనర్లకు దూకుడుగా ఉండే లేదా రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి, అవసరమైతే వాటిని ప్రత్యేక పౌండ్లు/షెల్టర్లలో ఉంచాలని సూచించారు. ప్రభుత్వం ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో ప్రారంభించి, దశలవారీగా ప్రమాదకరమైన/దూకుడుగా ఉండే జంతువుల కోసం ప్రత్యేక పౌండ్లను అమలు చేయడం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర జంతు జనన నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీని , స్థానిక జంతు జనన నియంత్రణ అమలు ,, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. వీటిలో మున్సిపల్, ఆరోగ్యం, పశుసంవర్ధక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు, భారత జంతు సంక్షేమ మండలి, రాష్ట్ర జంతు సంక్షేమ మండలి సభ్యుల్ని ఉంచారు.

మరోవైపు వీధి కుక్కలకు రోజువారీ/వారపు సంతాన నిరోధక లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 2023 ఏబీసీ నియమాల ప్రకారం గుర్తింపు ధృవపత్రాలు ఉన్న సాంకేతికంగా సమర్థులైన ఏజెన్సీలను ఎంపిక చేయాలని, వీధి కుక్కల జనాభాపై తిరిగి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంతాన నిరోధకత, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాలని ఆదేశించారు.

అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పిల్లల భద్రతను నిర్ధారించడానికి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. స్కూల్స్, ఆసుపత్రులు, బస్ డిపోలు, రైల్వేలు, క్రీడా సముదాయాల వంటి ప్రాంతాలను గుర్తించి, వాటిని సురక్షితం చేయాలన్నారు. అలాగే కుక్కలుక ప్రత్యేక ఆహార జోన్‌లను కేటాయించాలని, రోడ్లు, బహిరంగ వీధుల్లో జంతువులకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించాలని కూడా కోరారు.ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం లేదా ఆలస్యం జరిగినా చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.