జపాన్‌లో 2011లో వచ్చిన తోహోకు సునామీ వేలాది మందిని సముద్ర గర్భంలో కలిపేసుకోగా.. లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఘోర విలయం తర్వాత భవిష్యత్తులో అలాంటి భీకర సునామీల నుండి రక్షణ కల్పించేందుకు జపాన్ ‘గ్రేట్ సునామీ వాల్’ అనే భారీ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 395 కిలోమీటర్ల పొడవుతో జపాన్ తీరం వెంబడి 25 మీటర్ల లోతు పునాదులతో, 50 అడుగుల ఎత్తుతో, సునామీ రాకాసి అలలను తట్టుకునే విధంగా అత్యంత ధృడంగా ఈ గోడను నిర్మించారు. ఈ గోడతో పాటు, జపాన్ తీరంలో 9 మిలియన్ (90 లక్షల) చెట్లను నాటారు. దీనిని “గ్రేట్ ఫారెస్ట్ వాల్” గా పిలుస్తున్నారు.
ఈ చెట్లు సునామీ తరంగాల వేగాన్ని తగ్గిస్తాయి. ఈ గోడ నిర్మాణానికి సుమారు $6.8 బిలియన్ (సుమారు 50,000 కోట్ల రూపాయలు) ఖర్చు అయింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ఈ గ్రేట్ సునామీ వాల్.. జపాన్ యొక్క ముందుచూపు, సాంకేతిక, పర్యావరణాన్ని యుటిలైజ్ చేసుకునే విధానాలు అన్నీ కలిపి విపత్తు నివారణపై ఆ దేశ దార్శనికతకు గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే జపాన్ సునామి గ్రేట్ వాల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
































