Hallmark Gold: మీరు కొన్న గోల్డ్ పై హాల్ మార్క్ నిజమైనదేనా..? బీ కేర్ ఫుల్ అంటున్న పోలీసులు

భారతీయులు, బంగారానిది విడదీయలేని సంబంధం. అనాదిగా మన దేశంలో బంగారానికి గిరాకీ అధికమే. బంగారాన్ని సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. కాబట్టి పండగలు, శుభకార్యాలు పెళ్లిళ్లు, పేరంటాలకు బంగారం కొనుగోలు చేయడంసర్వ సాధారణం బంగారం కొందరు అలంకరణకు మరి కొందరు వారి స్థాయిని ప్రదర్శించటం కోసం ధరిస్తారు.


ఎంతలేని వారైనా తులం బంగారమైన కొనుగోలు చేస్తుంటారు. రైతులు మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని ధరించటానికి కాకుండా ఆర్ధిక భద్రత కొరకు కూడా కొంటూ ఉంటారు. ఏదయినా అవసరం వస్తే బంగారం కుదవ పెట్టుకొని వారి అవసరాలను తీర్చుకొంటారు. అందుకే రాజుల కాలం నుండి భారతీయులకి బంగారానికి విడదీయలేని అవినాభావ సంబంధముంది అంటారు

ఐతే ఇప్పుడు బంగారం ధర పెరగటం తో ఆభరణాల విక్రయ కర్తలు నాణ్యత లో తేడా చేస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు బీఐఎస్ హాల్ మార్క్ పద్దతిని ప్రవేశపెట్టింది. హాల్ మార్క్ ఉన్న నగలు కొన్నట్లయితే వాటి నాణ్యతలో రాజీలేనట్లే. కానీ ఈ నకిలీల బెడద బంగారు హాల్ మార్క్ ను కూడా వదలలేదు. మనం కొన్న బంగారు ఆభరణాలు హాల్ మార్క్ కలిగినవి అని నిశ్చంతగా బీరువాలో పెట్టుకునే కాలం పోయింది.

కొంతమంది కిలాడీలు నాణ్యత లేని ఆభరణాలపై కూడా హాల్ మార్క్ వేసి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. కొంతమంది కొనుగోలుదారుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని బీఐఎస్ అధికారులు గుంటూరులోని నకిలీ నగలపై హాల్ మార్కులు వేసేవారిని పట్టుకున్నారు. మంగళగిరికి చెందిన ముగ్గురు వ్యక్తులు గుంటూరుకు చెందిన వ్యక్తి కలసి హాల్ మార్క్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసి బంగారు నగల తయారీదారులకు హాల్ మార్క్ వేస్తుంటారు.

ఈ హాల్ మార్క్ 916 ఉన్న బంగారు ఆభరణాలకు వేయాలి. కానీ ఈ కేటుగాళ్లు నకిలీ బంగారానికి కూడా హాల్ మార్క్ వేస్తున్నారు. ఐతే అధికారులు పక్కా సమాచారంతో ఈ హాల్ మార్క్ తనిఖీ కేంద్రంపై దాడి చేసి వారిని పోలీసులకు అప్పగించారు.

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కేటుగాళ్లు లోగోలను కూడా కాపీ కొట్టేస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. వేలాది రూపాయలు పొసి కొనుగోలు చేసే బంగారంపైనా దాగా చేస్తూ అడ్డంగా దొచేస్తున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.