పీతల్లో చాలా రకాలు ఉంటాయి.. కొన్ని మంచి నీటి పీతలు.. మరికొన్ని ఉప్ప నీటి పీతలు.. సముద్ర తీర ప్రాంతాల్లోనూ రకరకాల పీతలు కనిపిస్తూ ఉంటాయి. నీటిలోనూ, తీరంలోనూ, ఇసుక బొరియల్లోనూ సాధారణంగా మనం వాటిని చూస్తూ ఉంటాం. కానీ విశాఖ సాగర్ నగర్ తీరంలో పసుపు రంగు పీతలు కనిపించాయి. చూడటానికి భలేగా అనిపించాయి. అటు ఇటు తిరుగుతూ.. ఒక్కోసారి ఉరుకులు పరుగులు పెడుతూ.. ఏదైనా హాని జరుగుతుందని అనిపిస్తే తనకు తాను రక్షించుకునేందుకు ముడుచుకుంటూ ఈ ఎండ్రకాయలు సందడి చేశాయి.
ఇవి బొరియల్లో, లేకపోతే సముద్రంలో మాత్రమే ఉంటాయట. తీరంలో ఈ పీతలు తిరగడం అరుదని మత్స్యకారులు అంటున్నారు. పగలంతా సముద్రంలో ఉన్నా చీకటి పడేసరికి మనిషి కంటపడకుండా బొరియల్లోకి దూరిపోతాయట. ఈ పీతలు మనిషిని చూడగానే బొరియల్లో దూరికిపోతాయి లేకపోతే సిగ్గరిలా ముడుచుకుంటాయట. వలలకు ఈ పీతలు అస్సలు చిక్కవట.. కానీ భలే రుచిగా ఉంటాయని అంటున్నారు మరికొందరు మత్స్యకారులు.
ఓసిపోడ్ క్వాడ్రాటా జాతికి చెందిన ఈ పీతలు.. ఉష్ణ మండల సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసిస్తాయి. నిటారుగా పైకి కనిపించే వాటి కళ్ళు 360 డిగ్రీలు తిరుగుతాయి. చిన్న పీతలు వాటి ఇసుక ఆవాసాలతో కలిసిపోయేలా రహస్యంగా అదే రంగులో ఉంటాయి.