తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు “మోహన్‌బాబు”. తనదైన డైలాగ్ డెలివరీతో, యాక్షన్ తో 50ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు.
ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేసి మెప్పించారు, ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశారు మోహన్ బాబు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన మోహన్ బాబు ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం మోహన్ బాబు నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల కాలంలో మంచి సక్సెస్ కోసం చూస్తున్న ఆయన.. మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన విలన్ పాత్రతో బాక్సాఫీస్ ఊచకోతకు సిద్దమయ్యారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గతంలో నాని – శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ క్రమంలోనే గతంలో మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. 1995లో ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చారు. అప్పుడు తన పరిస్థితి గురించి తెలుసుకున్న ఒకరు.. ఎటువంటి సమాచారం లేకుండానే నేరుగా తన వద్దకు వచ్చారని తెలిపారు. అప్పుడు తాను రాజమండ్రిలో ఉన్నానని.. అక్కడికి రావడమే కాకుండా తన కార్లో ఎక్కించుకుని ఒక హోటల్‌కు తీసుకెళ్లి ఒక ప్యాకెట్ ఇచ్చారని అన్నారు.
ప్యాకెట్ తెరిచి చూస్తే అందులో రూ.45 లక్షల డబ్బు ఉందని వివరించారు. అంతే కాకుండా తాను చెప్పకపోయినా కూడా పరిస్థితిని అర్ధం చేసుకొని డబ్బు ఇవ్వడమే కాకుండా.. నెక్స్ట్ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని భరోసా ఇచ్చారని ఎమోషనల్ అయ్యారు. అయితే మోహన్ బాబుకు అంత సాయం చేసిన వ్యక్తి ఎవరో కాదట తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు.. మోహన్ బాబుకు అత్యంత ఆప్తులు సూపర్ స్టార్ రజినీ కాంత్. మోహన్ బాబు – రజినీకాంత్ మంచి స్నేహితులు అందరికీ తెలిసిందే.
































