నన్ను కాపాడింది అతడే.. లేదంటే ప్రాణాలు పోయేవి: పులివర్తి నాని

తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందని, ఉప ఎన్నిక కోసమే తనను అంతమొందించాలన్న లక్ష్యంతోనే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. దాడి చేసిన వారు ప్రస్తుతం పుదుచ్ఛేరిలో ఉన్నారని.. వారందరికీ వసతి సౌకర్యాలను చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డే సమకూరుస్తున్నట్లు నాని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు ఇతర నేతలు సైతం తనకు అండగా ఉన్నారన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

”చంపేయండిరా.. బై ఎలక్షన్స్‌ వస్తాయి’ అని ఎవరో అన్నట్లు గన్‌మెన్‌, ఇంకొందరు నాతో చెప్పారు. అంటే ఓడిపోతామని వాళ్లు డిసైడ్‌ అయిపోయారు. అందుకే ఇలాంటివి చేస్తున్నారు. నేను ఒంటిగంట సమయంలో ఈవీఎంలను పరిశీలించేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గరికి వెళ్లా. ఈవీఎంలకు సీల్‌ వెయ్యలేదని చెబితే చూసి అక్కడి ఫొటోలు తీసి ఈసీకి ఫిర్యాదు చేశా. ఆర్వో ఫోన్‌ చేసి మధ్యాహ్నం 3గంటలకు సమావేశం ఉందని పిలిచారు. మీటింగ్ ఎక్కడని అడిగితే.. పద్మావతి మహిళా యూనివర్సిటీలో అన్నారు. నేను లోపలికి వెళ్లే లోపు నాపై దాడి జరిగింది. దాదాపు 30 నుంచి 40మంది వరకు దాడి చేసినవారిలో ఉన్నారు. నా పక్కకు కత్తి పట్టుకొని ఒకరు, సమ్మెట ఎత్తుకొని మరొకరు వచ్చి దాడి చేశారు. తృటిలో తప్పించుకున్నా.. నా భుజానికి తగిలింది. లేదంటే పుర్రె దెబ్బతినేదని వైద్యులు చెప్పారు. నేను కారులో ఉన్నప్పుడు అద్దాలు పగులగొట్టారు.. ఆ తర్వాతే కిందకు దిగాను’ అని వివరించారు.

వాళ్లే లేకపోతే నేను చనిపోయేవాణ్ని!

‘నేను బతికి ఉన్నానంటే కారణం నా గన్‌మెన్‌. దాంతో పాటు నాతో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు. నా దగ్గరికి దుండగులు రాకుండా అడ్డుకున్నారు. అయినా ఇద్దరు వచ్చి నన్ను లాక్కెళ్లి స్కార్పియోలో వేసుకొని నా బండి అడ్డంగా ఉంటే గుద్దుకొని ఎత్తుకెళ్లిపోయారు. నా గన్‌మెన్‌ లేకపోయి ఉంటే చనిపోయేవాణ్ని. గన్‌మెన్‌ ఆ మూకలతో పోరాడుతుంటే.. నాతో ఉండే పిల్లలు నన్ను తీసుకొచ్చి మా బండిలో వేశారు. ఇదంతా 15 -20 నిమిషాల పాటు జరిగినా ఏ పోలీస్‌ అధికారీ అక్కడికి రాలేదు. అంతకుముందు నేను కారులో ఉన్నప్పుడే అటాక్‌ జరిగిందని చంద్రగిరి డీఎస్పీకి చెప్పాను. ఆయన ఇన్‌ఫాం చేసి ఉంటే రెండు నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చి ఉండేవాళ్లు. కానీ ఎవరూ రాలేదు. దీన్నిబట్టి మాకు ఉన్న సమాచారం ప్రకారం.. కొందరు పోలీసులకు ఇది ముందే తొలుసు.. నాకు తెలిసి ఎస్పీకి తెలిసి ఉండకపోవచ్చు. 45 నిమిషాల తర్వాతే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ దాడి చిత్తూరు కల్చర్‌ కాదు.. కడప కల్చర్‌. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. నా ముందు కొందరు అడ్డంగా నిలబడ్డారు.. నేను తప్పించుకోకుండా వెనుక కారును అడ్డం పెట్టారు. దాంట్లోంచే సుత్తులు, గొడ్డళ్లు, బీరు బాటిళ్లు, రాళ్లు తెచ్చుకున్నారు.

”ఈ దాడిలో వైకాపా వాళ్లు 70-80శాతం ఉంటే.. ఇంకొందరు కొత్త వాళ్లు ఉన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి వాళ్లను తీసుకొచ్చారు. ఈ ఘటన జరగడానికి గంట ముందు విక్టరీ బార్‌లో 100మంది వరకు మద్యం తాగారు. భాస్కర్‌ రెడ్డి సీన్‌లో ఉండడు.. ఒంగోలులో కూర్చొని నడిపించాడు. నన్ను ఎటాక్‌ చేసిన వాళ్లంతా ఇప్పుడు పుదుచ్ఛేరిలో ఉన్నారు. వాళ్లకు గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా డబ్బు పంపారు. నేను ఆస్పత్రిలో ఉంటే.. అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి మా కార్యకర్తలపై సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో లాఠీఛార్జి చేయించారు. రామచంద్రారెడ్డి .. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బంధువు. ఈ దాడిలో కొందరికి చెయ్యి విరిగితే.. రుయాలో చేరారు” అని తెలిపారు.

ఎస్పీకి భయమట.. జూన్‌ 4వరకు ఆగాలట: సుధారెడ్డి

తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను ఒకరోజు గడిచినా పోలీసులు అరెస్టు చేయకపోవడంపై పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఆందోళనకు దిగారు. చంద్రగిరి తెదేపా నేతలతో కలిసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించిన ఆమె.. పోలీసులు చర్యలు తీసుకోవాలని అడిగితే జూన్‌ 4వరకు ఆగాలని చెబుతున్నారని ఆక్షేపించారు. ”నా భర్త ఒక్క సెకెనులో ప్రాణాలతో బయటపడ్డారు. జూన్‌ 4వరకు సైలెంట్‌గా ఉండాలంటూ సీఐ, ఎస్సై ద్వారా ఎస్పీ మెసేజ్‌ పంపారు. వైకాపా వాళ్లను టచ్‌ చేయలేరట. జూన్‌ 4 తర్వాత చెవిరెడ్డి అని కూడా చూడకుండా కాళ్లు విరగ్గొడతామని అంటున్నారు. మాకు అదంతా అనవసరం. మాకు న్యాయం కావాలి. 30మందితో వీడియో ఫుటేజీలతో ఆధారాలు ఇస్తే.. ఒక్కరినైనా అరెస్టు చేయలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ఎస్పీ గారూ.. మిమ్మల్ని ఎవరైనా కొడితే మేం కాపాడుకుంటాం. ప్రజాస్వామ్యంలో మమ్మల్ని రక్షించాల్సిన వారు మీరు. మీకే భయం అంటున్నారు.. మీకు ఆపద జరిగితే మాకు చెప్పండి మీ కుటుంబానికి, మీకు రక్షణగా నిలబడతాం” అని సుధారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *