బాల్యంలో చింతచెట్టు కింద పడ్డ చింతకాయలు ఏరుకుని.. వాటికి ఉప్పు-కారం అంటించి తినని వారు చాలా అరుదు. అయితే ఆ చిన్ననాటి రుచినే ఒక ఇంజనీర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారంగా మార్చాడు.
కర్ణాటక రాష్ట్రం బైలహొంగల పట్టణానికి చెందిన గిరీశ్ హలసగి.. చింతపండుతో ‘ఇమ్లీ చాకో’ అనే వినూత్న ఉత్పత్తిని రూపొందించి, భారతదేశంలోనే తొలి పేటెంట్‌ను సొంతం చేసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
గిరీశ్ హలసగి రిటైర్డ్ ఉపాధ్యాయులు మహదేవప్ప, వీరమ్మ దంపతుల కుమారుడు. చదువులో ఎప్పుడూ ముందుండే గిరీశ్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ, ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచారు. 2002లో బాగల్‌కోట్‌లోని బసవేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో బీఈ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ.. తన ఊరికి, తన మట్టికి ఏదైనా చేయాలనే తపన ఆయనను ముందుకు నడిపించింది.
2013-14లో ఒక ప్రముఖ సంస్థ.. గిరీశ్‌కు ఏకంగా రూ.600 కోట్ల విలువైన ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు.డబ్బు కంటే నా కల పెద్దది. నా ప్రతిభ నా ఊరికి ఉపయోగపడాలి. నా లక్ష్యం రూ.1000 కోట్ల వ్యాపారం సృష్టించడం అనే దృఢమైన నమ్మకంతో ఆయన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించారు.
చింతపండుకు సరైన గుర్తింపు రావడం లేదని గ్రహించిన గిరీశ్.. 2016లో పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు అనేక ప్రయోగాలు చేశారు. చింతపండు, బెల్లం, ఉప్పు, మిరియాలు, జీలకర్ర వంటి సహజ పదార్థాలతో చాకో అనే ప్రత్యేకమైన ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగాల కోసం దాదాపు రూ.60 లక్షల వరకు అప్పులు కూడా చేశారు.
సాధారణంగా చింతపండును గుజ్జుగా అమ్మే విధానానికి భిన్నంగా.. గిరీశ్ దాన్ని చిన్న చిన్న చాక్లెట్‌లా ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో తీసుకొచ్చారు. రంగురంగుల అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేసిన ఇమ్లీ చాకో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రదర్శనల్లో పిల్లలు ఆయనను ప్రేమగా చాకో అంకుల్ అని పిలవడం విశేషం. 2021లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా.. 2025 ఏప్రిల్ 25న అధికారికంగా పేటెంట్ లభించింది. దీంతో చింతపండు చాకోకు పేటెంట్ పొందిన తొలి భారతీయుడిగా గిరీశ్ హలసగి రికార్డు సృష్టించారు. పేటెంట్ వచ్చిన తర్వాత ఈ ఉత్పత్తికి డిమాండ్ మరింత పెరిగింది.
ప్రస్తుతం ఇమ్లీ చాకోను అమెరికా, ఇంగ్లండ్, కెనడా, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, రష్యా సహా 17 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతను కూడా గిరీశ్ మరిచిపోలేదు. ఆశా హోమ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తూ నెలకు రూ.10 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. భార్య ఆశ కూడా వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆరోగ్యపరంగా కూడా ‘ఇమ్లీ చాకో’ ఎంతో ప్రయోజనకరమని గిరీశ్ చెబుతున్నారు. జీర్ణశక్తిని పెంచడం, మలబద్ధకం తగ్గించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో బైలహొంగలలో ఒక పెద్ద ఎంఎన్‌సీ స్థాయి సంస్థను స్థాపించడమే తన లక్ష్యమని గిరీశ్ అంటున్నారు.



































