రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా (యూనివర్సల్ హెల్త్ పాలసీ)ను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే (బీపీఎల్ )కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో.. ఏ వ్యాధికి ఎంత వెచ్చిస్తున్నామో విశ్లేషించాలని సూచించారు.
ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యురేటివ్ విధానం ద్వారా వైద్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతోపాటు ప్రజల వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గేలా చూడాలని స్పష్టంచేశారు.
పేదలకు మెరుగైన సేవలకే ‘పీపీపీ’
పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య కళాశాలలను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ‘వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నా.. పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానిదే. వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు ఇక గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయి. ప్రజలకు, విద్యార్థులకు.. అంతిమంగా సమాజం మొత్తానికీ వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఆసుపత్రుల్లో 70 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నాం. వైద్య సేవలు కూడా ఉచితంగా అందుతాయి’ అని అన్నారు.
పీపీపీ కింద తొలి విడతలో చేపడుతున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్యకళాశాలలపై సీఎం ఆరా తీశారు. వీలైనంత త్వరగా వీటి పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో నాలుగు దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి 50 ఎకరాల చొప్పున కేటాయించామన్నారు. 25 ఎకరాల్లో వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్, ఆయుర్వేద, వెల్‌నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటుచేసి అనుసంధానించాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లలో నిర్వహిస్తున్న ఆసుపత్రులను అధ్యయనం చేసి, రోగులకు నాణ్యమైన, మెరుగైన సేవలు సులభంగా అందించాలన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలని, నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా ‘సంజీవని’
కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు వైద్య రంగంలో రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, దేశానికి దిక్సూచిగా నిలిచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. టాటా-బిల్‌గేట్స్ ఫౌండేషన్‌లతో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శం కావాలన్నారు. ఈ ప్రాజెక్టులో డిజిటల్ హెల్త్‌కార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతం కుప్పంలో అమలవుతున్న సంజీవని ద్వారా 3.38 లక్షల మంది ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా నేచురోపతి ఆసుపత్రితోపాటు, యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- కుప్పంలో రిజిస్టర్ అయిన వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని వివరించారు. 49 వేల మంది రోగులకు సంబంధించిన డేటా సేకరించామన్నారు. 2026 జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి సంజీవని ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపారు.
- ఎన్టీఆర్ వైద్యసేవకు ఆసుపత్రుల నుంచి ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్‌లు వస్తున్నాయని, నెలకు రూ.330 కోట్లు ఖర్చవుతోందని అధికారులు సీఎంకు వివరించారు. వీసీ ద్వారా మంత్రి సత్యకుమార్ హాజరుకాగా.. సమీక్షలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కార్యదర్శి వీరపాండియన్ పాల్గొన్నారు.
































