రాత్రి భోజనం అనంతరం ఇలా చేయండి.. బరువు పెరగరు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది..

www.mannamweb.com


రోజూ మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధార పడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మన శరీరరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మంచి అలవాట్లను పాటించాలి.

అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా జంక్ ఫుడ్‌కు అలవాటు పడి అతిగా తినేస్తున్నారు. సమయానికి భోజనం చేయడం లేదు. రాత్రి కూడా ఆలస్యంగా భోజనం చేసి ఆలస్యంగానే నిద్రిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అధికంగా బరువు పెరగడానికి కారణం అవుతోంది. అలాగే ఇలాంటి అలవాట్ల వల్ల చాలా మందికి డయాబెటిస్ కూడా వస్తోంది. అయితే రాత్రిపూట కొన్ని అలవాట్లను పాటించడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొ బయోటిక్స్‌..

రాత్రి పూట భోజనం చేసిన అనంతరం లేదా భోజనం చివర్లో ప్రొబయోటిక్ ఆహారాలను తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ ప్రొ బయోటిక్ ఆహారాల కిందకు వస్తాయి. వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చూడడంలో ప్రొ బయోటిక్ ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రాత్రి పూట భోజనం చేసిన అనంతరం గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా అజీర్తి ఉండదు. గ్యాస్ సమస్య ఏర్పడదు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

వాకింగ్‌..

రాత్రి భోజనం చేసిన అనంతరం 10 నుంచి 15 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం రాకుండా ఉంటుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అదేవిధంగా రాత్రి భోజనం చేసిన అనంతరం గోరు వెచ్చని నీటిని లేదా హెర్బల్ టీని సేవించాలి. అల్లం, పెప్పర్‌మింట్ లేదా కమోమిల్ టీ లను సేవించవచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థ కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం రాకుండా ఉంటుంది. అలాగే షుగర్‌, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.

వజ్రాసనం..

చాలా మంది రాత్రి పూట నిద్రకు ముందు నీళ్లను తాగరు. కారణం.. రాత్రి పూట మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని. అయితే రాత్రి నిద్రకు ముందు కచ్చితంగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతోపాటు రాత్రి పూట బీపీ పెరగకుండా, హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. కనుక నిద్రకు ముందు నీళ్లను తాగడం తప్పనిసరి. అదేవిధంగా రాత్రి భోజనం అనంతరం వజ్రాసనం వేయవచ్చు. ఇది భోజనం అనంతరం వేసే ఆసనం. దీని వల్ల గ్యాస్ సమస్య ఏర్పడదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. రోజూ రాత్రి ఈ ఆసనాన్ని వేయాలి. దీంతో ఎంతో ఫలితం ఉంటుంది. ఇలా రాత్రి పూట భోజనం చేసిన అనంతరం పలు సూచనలను పాటించడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో బరువు పెరగకుండా చూసుకోవచ్చు.