Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు కారణమేంటి..? దీని నుంచి బయటపడటం ఎలా..?

భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి కాలేయ సిర్రోసిస్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది.
ఆల్కహాల్, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మద్యం సేవించని వారు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. ఈ రకమైన వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అటువంటి పరిస్థితిలో, మద్యం సేవించని వ్యక్తులు కొవ్వు కాలేయ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారు అన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న.


నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పేలవమైన జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ అనేది ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారిలో వస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారికి కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. WHO నివేదిక ప్రకారం, అమెరికా జనాభాలో 25 శాతం మందికి నాన్ ఆల్కహాలిక్ వ్యాధి ఉంది. భారతదేశంలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్, వ్యాయామం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని గుర్తుంచుకోవాలి.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా తగ్గించాలని ఢిల్లీలోని ఎయిమ్స్ డా. నీరజ్ కుమార్ చెప్పారు. దీని కోసం, ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలని.. జీవనశైలిని చక్కగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయాలని.. పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు చెబుతున్నారు. పసుపు, గోరువెచ్చని నీరు కలుపుకుని తాగడం లేదా పసుపు, తేనె కలుపుకుని తీసుకోవడం, పసుపు, నారింజ తొక్క కలిపి తీసుకోవడం ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టవచ్చు.
(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి)