ప్రస్తుత కాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి కారణం ఏంటని మాత్రం కచ్చితంగా డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు.
ఇందులో కొంతమంది ధూమపానం,మద్యపానం వల్ల గుండెపోటుకి గురయితే, మరికొంతమంది ఉద్యోగ టెన్షన్లు, ఆహారపు అలవాట్లు, ఆయిల్ తో కూడిన ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల గుండెపోటుకు గురై సడన్ గా మరణిస్తున్నారు. మరి కొంతమంది అధిక వ్యాయామం కారణంగా కూడా గుండెపోటుతో మరణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
అయితే ఈ గుండెపోటు అనేది ఎక్కువగా యువతను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ఈ మధ్యకాలంలో 8 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు కూడా ఈ గుండెపోటుతో మరణిస్తుండడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇలా ప్రతి ఏటా వేలాది మంది గుండె సమస్యల బారిన పడుతుంటే.. అందులో కొంతమంది అప్రమత్తమయ్యి చికిత్స తీసుకుంటుంటే.. మరికొంతమంది అకాల మరణం పొందుతున్నారు. అయితే ఇలాంటి మరణాలకు చెక్ పెట్టేలా.. క్షణాల్లో గుండెను పరీక్షించేలా.. వినూత్న పద్ధతులను అవలంబిస్తూ.. సరికొత్త టెక్నాలజీతో ప్రజల ముందుకు వచ్చారు వైద్యులు. మరి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బెంగళూరులోని నారాయణ హెల్త్ కేర్ వారు.. ఏఐ టెక్నాలజీ ద్వారా క్షణాల్లోనే గుండె పని తీరును తెలియజేస్తాయని తెలిపారు. సాధారణంగా గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవాలి అంటే ఈసీజీ ద్వారా గుర్తించేవారు. కానీ ఇప్పుడు సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా క్షణాల్లో కచ్చితత్వంతో కూడిన రిజల్ట్ బయటకు వస్తుందని నారాయణ హెల్త్ కేర్ వైద్యులు డా.దేవి శెట్టి తెలియజేశారు . ఇది హృద్రోగ చికిత్సలకు సరికొత్త ఆవిష్కరణ అని ప్రశంసించారు. దేశంలో ఏటా కోట్లాదిమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారని, వారిలో లక్షలాదిమంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని అన్నారు.
అలాంటివారికి ఇది ఒక సరికొత్త వైద్యం అంటూ డాక్టర్ దేవి శెట్టి తెలియజేశారు. లక్షలాదికి పైగా ఈసీజీ రిపోర్టులను అధ్యయనం చేసి, ఈ మేధస్సును కనుగొన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం చిన్న చిన్న పిల్లల్లో కూడా గుండెనొప్పి వస్తుందని దీనికి కారణం ఏంటనేది తెలియడం లేదని అన్నారు. ఇకపోతే జనాల్లో కరోనా వ్యాధికి టీకా వేయించుకున్నప్పటి నుంచి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని కొంతమంది అంటుంటే.. అది కాదని మరికొంతమంది అంటున్నారు. గుండె సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ సకాలంలో మనం ఇలాంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షలు చేయించుకుంటే ముందస్తుగా గుండెనొప్పి బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు.
































