తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష ముప్పు

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది సోమవారం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని, 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లి మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని వెల్లడించింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడేందుకు అవకాశం ఉందని వివరించింది. అలాగే, ఈ నెల 25 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది.