రాబోయే 3 నెలల్లోనూ విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది పోస్ట్‌ మాన్‌సూన్‌ (అక్టోబరు నుంచి డిసెంబరు వరకు) సీజన్‌లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అక్టోబరులో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే సీజన్‌లో నీటి వనరులు నిండటం, వ్యవసాయ పనులకు ప్రయోజనం చేకూరడంతో పాటు వరదల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐఎండీ జారీ చేసే ముందస్తు హెచ్చరికలను అనుసరించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ముగిసినా.. వానలే

మరోవైపు దేశంలో అక్టోబరు నెలలోనూ సాధారణం కన్నా 15 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఈశాన్య, వాయవ్య భారతంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటాయని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది వర్షాకాలం మంగళవారంతో ముగిసిందని, వర్షపాతం సాధారణం కన్నా ఎనిమిది శాతం అధికంగా నమోదైందని తెలిపింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 937.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. దక్షిణ భారత్‌లోని ఐదు వాతావరణ విభాగాలైన తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో దీర్ఘకాల సగటు కన్నా 112 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో మరో వాయు‘గండం’

గుజరాత్‌ పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బుధవారం లోగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని, తర్వాత అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని, శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటొచ్చని ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో, గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వానలు పడొచ్చని తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.