కోస్తా జిల్లాలకు మరో రెండు, మూడు రోజుల వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి తోడైంది.
దీంతో శనివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం విజయనగరం, గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలకు వర్ష సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదివారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉభయగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల భారీ అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని… మరో మూడు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
అల్పపీడనం క్రమంగా…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఎల్లుండి నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుంది. అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. అల్ప పీడనం కు అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం . జైసల్మేర్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతొంది అల్ప పీడనం. ఎల్లుండి నాటికి వాయువ్య బంగాళాఖాతం- పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండం గా మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా 3 రోజులలో ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.