చెన్నైలో భారీ వర్షాలు .. స్తంభించిన జనజీవనం

www.mannamweb.com


బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, చెన్నైపలు జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ వరద నీటితో పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది.. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బుధవారం తమిళనాడులో పలు ప్రాంతాలకు భారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై నగరం మళ్లీ నీట మునిగింది. దాదాపు 300 ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పేట జిల్లాల్లో విద్యాసంస్థలను సెలవు ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవల మినహా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను కూడా మూసివేయాలని పేర్కొంది. బుధవారం ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు గురువారం నాటికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంట నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు విచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్ష సూచన కారణంగా ప్రైవేట్ ఐటీ కంపెనీలు అక్టోబర్ 18 వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఉద్యోగులకు సూచించారు సీఎం స్టాలిన్.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 15 అర్ధరాత్రి నుంచి చెన్నైలో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షపు నీటితో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని పలు జంక్షన్లో వరద నీరు చుట్టుముట్టింది. చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్ని వాయిదా వేశారు.ఉత్తర చెన్నై లోని పెరంబూర్, పట్టాళం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరువాన్మియూర్ లోని వాల్మీకీ నగర్, ఏజీఎస్ కాలనీ, అడయార్ లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కార్లు ఇళ్ల ముందు ఉంచితే.. వరదల్లో కొట్టుకు పోవొచ్చు అన్న ఆందోళనతో ఫైఓవర్లపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నై- వేళచ్చేరి ఫ్లై ఓవరపై కార్లు వరుసగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.