రెండు రోజుల్లో మరో అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్షాలు..

www.mannamweb.com


బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది.

రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రధానంగా విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశంముంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అల్లకల్లోలంగా సముద్రం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు విశాఖ తుఫాను కేంద్రం అధికారి శ్రీనివాస్.

రాజోలు దీవిలో రెండు రోజులు కుండబోత..

రాజోలు దీవిలో రెండు రోజులగా కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాజోలు నియోజకవర్గ కేంద్రమైన పోలీస్ సర్కిల్ ఆఫీస్, ట్రెజరీ ఆఫీస్, తహసీల్దార్, ఫైర్ స్టేషన్ ఆఫీసులలో నీరు చేరడంతో సిబ్బందికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి మరోక 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.