భారీ వర్షాలు – ఏపీలోని ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక

ఏపీ జిల్లాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడు తున్నాయి. కోస్తా.. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతండగా .. మరి కొన్ని ఏరియాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా, వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. అటు అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాక నున్నాయి. జూన్ 10 నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎండలతో పాటుగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు రావటంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వాగు ఉద్ధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరింది. కక్కలపల్లి మండలం ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండలం కందుకూరు సమీపంలో ఉన్న సీపీఐ కాలనీలో నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఇంటి నుంచి బయటకు రాలేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసుకునే దుస్తుల నుంచి తినే ధాన్యం వరకు తడిసిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ఉద్ధృతి అధికమవుతుండటంతో ఇళ్లల్లో ఎవరు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం సిద్దుగూరిపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. సిద్దుగూరిపల్లిలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కదిరి- పులివెందుల ప్రధాన రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బుధవారం రాత్రి ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలను సందేశాల ద్వారా ఆ ప్రాంతాల ప్రజలకు పంపుతోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.