కేదార్​ నాథ్​ కు హెలికాప్టర్​ బుకింగ్స్ ఓపెన్ .. రూ.6వేలతో వెళ్లి రావచ్చు

దేశంలో 12 జోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. అవి సోమనాథ్, మల్లికార్జున (శ్రీశైలం), ఓంకారేశ్వర్, కేదార్‌ నాథ్, భీమేశ్వర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, నాగేశ్వర్, గిరిజేశ్వర్, రుద్రేశ్వర్, నరసింగేశ్వర, విష్ణునాథ్.


వీటిలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కేదార్​ నాథ్​ ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా శైవ భక్తులు కేదార్ నాథ్ ను దర్శించుకుంటారు.

చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌ నాథ్‌ క్షేత్రాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే.. కేదార్‌ నాథ్‌ వెళ్లేందుకు గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో 18 కి.మీ.. హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు ఈ యాత్రలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం 2023లో హెలికాప్టర్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది వినియోగించుకుంటున్నారు.

చార్ ధామ్ యాత్రలో భాగంగా మొదట గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత కేదార్‌ నాథ్‌ ఆలయాన్ని మే 2 ఉదయం 7గంటలకు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నట్లు బద్రీనాథ్- కేదార్‌ నాథ్‌ టెంపుల్ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తపిల్యాల్ వివరించారు.

ఇక కేదార్‌ నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునేవారు టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ IRCTC సైట్ ఓపెన్ చేసి.. అందులోని ప్రత్యేక పోర్టల్‌ https://heliyatra.irctc.co.in/ లోకి వెళ్లి వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 నుంచి బుకి​ంగ్స్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మే 2 నుంచి 31 వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. సర్సీ హెలిప్యాడ్‌.. కేదార్‌ నాథ్‌ ఆలయం నుంచి కేవలం 23 కి.మీ దూరంలోనే ఉండగా.. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో పాటు ఫటా, గుప్తకాశీ ప్రాంతాల నుంచి కూడా హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక ధరల విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ సారి హెలికాప్టర్ ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిర్సి నుంచి కేదార్‌ నాథ్‌ వెళ్లి రావడానికి రూ. 6,063 కాగా ఫటా నుంచి కేదార్‌ నాథ్‌ కు​ రూ.8,533 అవుతుందని వివరించారు.